హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలు, ఫలితాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు గ్రూప్-1 ఉద్యోగాలను తమ వాళ్లతో భర్తీ చేసుకోవాలని చూశారని, అందులో భాగంగానే పరీక్షల నిర్వహణ, ఫలితాల్లో ఈ గోల్మాల్ జరిగిందని విమర్శించారు. గ్రూప్-1 అవకతవకలపై హైకోర్టుకు వెళ్లిన అభ్యర్థుల పక్షాన తీర్పు వెలువడటంతో వారి అనుమానాలకు బలం చేకూరిందని చెప్పారు. ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని పేర్కొన్నారు. ఇది గ్రూప్-1 అభ్యర్థుల పోరాట ఫలితమని, బీఆర్ఎస్ పార్టీకి నైతిక విజయమని అభివర్ణించారు.
అంతిమ విజయం ఎప్పుడూ ధర్మానిదే అని మరోసారి నిరూపితమైందని అభిప్రాయపడ్డారు. గ్రూప్-1 అవకతవకలపై ప్రశ్నించిన తనకు టీజీపీఎస్సీ నోటీసులిస్తే.. హైకోర్టు మాత్రం టీజీపీఎస్సీకే నోటీసులు ఇచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బుల్లింగ్, బుల్డోజ్, బ్లాక్మెయిల్ వంటి 3 నియమాలను మాత్రమే నమ్మకున్నట్టుగా ఉన్నదని ధ్వజమెత్తారు. గ్రూప్-1పై వేసిన కేసులను తుంగలో తొక్కిస్తా అంటూ అహంకారపూరితంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారని తెలిపారు. ఇదే విషయంపై కోర్టు ఆయనకే మొట్టికాయలు వేసిందని తెలిపారు. పరీక్షలకు హాజరైన వారికంటే.. విడుదలైన ఫలితాల్లో 10 మంది అదనంగా ఎలా పెరిగారని హైకోర్టు ప్రశ్నిస్తే.. దానికి సమాధానంగా ‘సర్వసాధారణమే’ అనడం టీజీపీఎస్సీ నిర్లక్ష్యానికి అద్దం పట్టినట్టుగా ఉన్నదని ధ్వజమెత్తారు. మహిళా యూనివర్సిటీలో కేవలం మహిళలకు మాత్రమే ఎందుకు సెంటర్ ఏర్పాటుచేశారని హైకోర్టు ప్రశ్నించినా, టీజీపీఎస్సీ సరైన సమాధానమే ఇవ్వలేకపోవడం దారుణమని పేర్కొన్నారు. 18, 19 నంబర్లు గల ఆ రెండు పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలు రాసిన అభ్యర్థులే ఎలా ఎంపికయ్యారు? అని ప్రశ్నించారు.
గ్రూప్-1పై కేసులు దాఖలు చేసిన అభ్యర్థులను సాక్షాత్తు హైకోర్టులోనే బ్లాక్మెయిల్కు, బెదిరింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని రాకేశ్రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన కేవలం 16 నెలల్లోనే కోర్టు చేత మొట్టికాయలు వేయించుకున్న ఏకైక ప్రభుత్వం బహుశా ఇదేనని దుయ్యబట్టారు. ఈ కేసు గెలిచేదాకా గ్రూప్-1 అభ్యర్థుల తరఫున న్యాయస్థానంలో కోట్లాడుతూనే ఉంటామని స్పష్టంచేశారు.