మహబూబ్‌నగర్/నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అదే జోరు.. అదే జనహోరు.. ఎటుచూసినా జన ప్రభంజనం.. ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ రాకతో మునుగోడు జనం చిందేయగా.. నల్లమల పూనకమూగింది. సీఎం కేసీఆర్ సభలకోసం ఎర్రటి ఎండలోనూ ప్రజలు మూడున్నర గంటలసేపు ఓపికగా వేచి చూశారు. కేసీఆర్ హెలికాప్టర్ చెక్కర్లు కొడుతుంటే కింది నుంచి జనం అభివాదం చేస్తూ పులకించిపోయారు. ఆయన స్టేజీపైకి వస్తుండగా ఈలలు, చప్పట్లతో మార్మోగించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలు దుమ్ము లేపాయి. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ఊహించని రీతిలో జనం హాజరయ్యారు.
మధ్యాహ్నం 12గంటల నుంచే జనం రాక మొదలైంది. భానుడు భగభగమంటున్నా గులాబీ కండువాలే తమకు రక్షణ అనేవిధంగా వాటిని నెత్తిపై కప్పుకొని మరీ అధినేత కేసీఆర్ కోసం ప్రజలు వేచిచూశారు. కేసీఆర్ రాగానే ఈలలు కొడుతూ, జెండాలు ఊపుతూ అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ దాదాపు 30 నిమిషాలపాటు ప్రసంగించగా ఒక్క అంగుళం కూడా కదలకుండా ఆసక్తిగా ఆలకించారు. గువ్వల బాలరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరగా.. చప్పట్లు, ఈలలతో ఆమోదాన్ని తెలియజేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ ఉండగా, గంట ముందే పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్ నిండిపోయింది. స్థలం లేక చాలా మంది బయట నిలబడ్డారు. చెట్ల నీడన.. రాజావారి బంగ్లా నుంచి సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. రెండు ఆశీర్వాద సభల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులను ప్రగతి ప్రదాత కడిగి పారేయగా.. జనం చప్పట్లు కొడుతూ కేసీఆర్‌కు మద్దతుగా నిలిచారు. కేసీఆర్ మాటలకు మంత్రముగ్ధులై.. జనం జేజేలు పలికారు.
మునుగోడు ప్రజా ఆశీర్వాద సభకు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సీఎం కేసీఆర్ రాక ఆలస్యమైనా ప్రజలు సాయంత్రం వరకు వేచి చూసి తమ చైతన్యాన్ని ప్రదర్శించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలిరాగా, సీఎం ప్రసంగం ఆద్యంతం సభికుల్లో ఉత్సాహాన్ని నింపింది. మునుగోడు అభివృద్ధి గురించి ప్రస్తావించిన ప్రతిసారి జనం నుంచి విశేష స్పందన లభించింది. విపక్షాలపై కేసీఆర్ పదునైన విమర్శలకు జనం చప్పుట్లు, ఈలలతో స్పందించారు. ‘నిన్న ఒక పార్టీ.. ఇయ్యాల ఒక పార్టీ.. రేపొక పార్టీ.. కేవలం డబ్బు మదంతోని, డబ్బు అహంకారంతోని, ఏమైనా చేయగులుతాం.. ప్రజలను కొనగలుగుతాం.. అనుకునేవాళ్ల పట్ల నల్లగొండ చైతన్యం, కమ్యూనిస్టు చైతన్యం మరోసారి చూపెట్టాలి’ అని సీఎం కేసీఆర్ పిలుపునివ్వగా.. జనం అరుపులు, కేకలతో స్పందించారు. ఉప ఎన్నికల చైతన్యాన్ని మరోసారి చూపెట్టాలని, ప్రభాకర్‌రెడ్డిని మళ్లీ గెలిపించాలని సీఎం కోరగా, చప్పట్లతో స్వాగతించారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం జనంలో జోష్ నింపింది. ఉప ఎన్నికల్లో హామీలను 90 శాతం పూర్తి చేశామంటూ సీఎం కేసీఆర్ ప్రసంగం ప్రారంభంలో ప్రకటించగా హర్షధ్వానాలతో స్వాగతించారు. డిండి ఎత్తిపోతల ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని ఏడాదిన్నరలోగా పూర్తి చేసి ఇస్తామన్నప్పుడు చప్పట్లు మార్మోగాయి. అవకాశం ఉంటే మళ్లొక్కసారి మునుగోడుకు వస్తానని కేసీఆర్ చెప్పినప్పుడు సభికులు చప్పట్లతో స్వాగతించారు.