హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : 22ఏ నిషేధిత జాబితాలో ఆస్తులు చేరి తీవ్రంగా నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్టు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ప్రకటించారు. పది మంది న్యాయవాదులతో ఏర్పాటు చేసే ఈ లీగల్ సెల్ ద్వారా బాధితులకు ఉచిత న్యాయసాయం అందిస్తామని చెప్పారు. ఉచిత న్యాయం కోసం న్యాయవాది కల్యాణ్‌ను 812535604 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. బాధితులు ఆందోళన చెందవద్దని, కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా 22ఏ నిషేధిత జాబితా కారణంగా నష్టపోయిన బాధితులతో పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్ (జనతా గ్యారేజ్)లో బుధవారం ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు విన్నారు. 22ఏ పేరుతో ప్రజలను భయపెట్టి 20, 30 శాతం కమీషన్లు వసూలు చేసే ప్రయత్నాలకు బాధితులు లొంగవద్దని సూచించారు. తకువ ధరలకు ఆస్తులు అమ్ముకోవద్దని, ఎంతటి పోరాటానికైనా సిద్ధమై ప్రభుత్వం మెడలు వంచి బాధితుల ఆస్తులను రక్షించే బాధ్యతను బీఆర్ఎస్ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. లీగల్ సెల్ సహాయంతోపాటు అధికారులు, కలెక్టర్లను కలిసి సమస్య పరిషారమయ్యే వరకు బాధితుల తరఫున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోరాడుతారని చెప్పారు.
హుడా, హెచ్ఎండీఏ అనుమతులతో ఏర్పాటైన లేఅవుట్లలో 30 ఏండ్ల క్రితం కొనుగోలు చేసిన ఇండ్లను సైతం ఇప్పుడు 22ఏ జాబితాలో చేర్చడం వెనుక భారీ కమీషన్ల దందా ఉన్నదని హరీశ్ విమర్శించారు. బుద్వేల్లోని సర్వే నంబర్లు 282, 283, 284లోని సుమారు 30 ఎకరాల భూమిని ఒత్తిళ్ల ద్వారా రాత్రికి రాత్రే 22ఏ నుంచి తొలగించి కోట్ల రూపాయల దందా చేశారని చెప్పారు. శేరిలింగంపల్లి సర్వే నంబర్లు 20/1, 21లోని భూములకు సంబంధించి 30 శాతం కమీషన్ తీసుకుని 22ఏ నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లు చేయించారని, బిల్డర్ పని పూర్తయిన తర్వాత మళ్లీ 22ఏలో చేర్చారని పేరొన్నారు. సంగారెడ్డి సమీపంలోని శిల్పా మోహన్‌రెడ్డి భూమి విషయంలోనూ ఇదే తరహాలో వ్యవహరించారని తెలిపారు.
తాండూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎకరాల్లో కొన్ని గజాల చొప్పున బకరాలకు అమ్ముతున్నారని రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరే కాంగ్రెస్ ప్రభుత్వ అసలు రంగును బయటపెట్టింది. రేవంత్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపారం తెలిసి ఉండొచ్చు. కానీ, బీఆర్ఎస్ నాయకులకు ప్రజల తరఫున ప్రాణాలకు తెగించి పోరాడటం తెలుసు.
-హరీశ్‌రావు
అమీన్పూర్ కేఎస్ఆర్ కాలనీలో సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా సుమారు 500 ఇండ్లను 22ఏలో చేర్చి కాలనీవాసులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 2008లోనే సీలింగ్ రద్దయి, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అనుమతులతో నిర్మించుకున్న ఇండ్ల్లను ఇప్పుడు సీలింగ్ భూములుగా పేరొనడం దుర్మార్గమని మండిపడ్డారు. అక్రమాలను కప్పిపుచ్చుకొనేందుకే భూభారతి వెబ్‌సైట్‌ను డౌన్ చేసి హైదరాబాద్ జిల్లా భూములకు సంబంధించిన వివరాలు కనిపించకుండా చేశారని ఆరోపించారు. ప్రజలను మీ-సేవ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పకుండా, ప్రభుత్వం చేసిన తప్పును ప్రభుత్వమే సుమోటోగా స్వీకరించి ఆన్లైన్లో 22ఏ ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో స్పందించి 22ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించకుంటే బాధితులతో కలిసి పెద్దఎత్తున ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హరీశ్ హెచ్చరించారు. అక్రమాలకు కారణమైన అధికారులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, భాస్కర్‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పార్టీ నేతలు తుల ఉమ, ఎర్రోళ్ల శ్రీనివాస్, కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు.
ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 22ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించకుంటే బాధితులతో కలిసి పెద్దఎత్తున ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తం. 22ఏ పేరుతో భయపెట్టి 20, 30 శాతం కమీషన్లు వసూలు చేసే ప్రయత్నాలకు బాధితులు లొంగవద్దు. తకువ ధరలకు ఆస్తులు అమ్ముకోవద్దు. ఎంతటి పోరాటానికైనా సిద్ధమై ప్రభుత్వం మెడలు వంచి బాధితుల ఆస్తులను రక్షించే బాధ్యతను బీఆర్ఎస్ తీసుకుంటుంది.
-హరీశ్‌రావు
22ఏ పరిధిలో ఆస్తులు, భూములు ఇరుక్కుపోయిన బాధితుల బాధలు వర్ణణాతీతం. ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ. ఎవర్ని కదిలించినా కన్నీళ్లే రాలుతున్నాయి. ఫ్లాట్ అమ్మి బిడ్డ పెండ్లి చేద్దామని ఒకరు.. ఇంటి స్థలం కొనుగోలు చేసి పైసలు కట్టినా రిజిస్ట్రేషన్ చేయడంలేదని మరొకరూ.. ఇల్లు అమ్మి అప్పు తీర్చుదామని వేరే వాళ్లకు విక్రయించి..లోన్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొనుగోలు చేసిన వ్యక్తి డబ్బులు ఇవ్వడం లేదని ఇంకొకరు.. కోటి వెచ్చించి ఇల్లు కొనుక్కొని డబ్బులన్నీ కట్టిన తర్వాత 22ఏలో చేర్చడంతో రిజిస్ట్రేషన్ కావడం లేదని మరొకరు.. 20 ఏండ్లుగా పైసాపైసా కూడబెట్టి కొన్న ఇంటి స్థలం నిషేధిత జాబి తాలో చేరడంతో ఏమీ పాలుపోవడంలేదని, ఇంట్లో భార్యాపిల్లలు తిడుతున్నారని మరోవ్యక్తి, సొంత భూమిని నిషేధిత జాబితాలో చేర్చి విడిపించమంటే అధికారులు లంచమడుగుతున్నారని ఓ ఉద్యోగి..ఇలా బాధితులంతా గగ్గోలు పెడుతున్నారు. తిండీతిప్పలు మాని రిజిస్ట్రేషన్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగిలా తిరుగుతున్నారు.
కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న 22ఏ బాధితులు చివరికి జనతా గ్యారెజ్ (తెలంగాణ భవన్) తలుపులుతట్టారు. బుధవారం పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావును కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ‘ప్రభుత్వం కండ్లు తెరిపించి నిషేధిత జాబితాలో ఉన్న మా భూములు, ఇండ్లు, ఫ్లాట్లు, ఇంటిస్థలాలను విడిపించండి’ అంటూ వేడుకున్నారు. అధికార పార్టీ పెద్దలు గద్దల్లా మారి అధికారులతో కుమ్మక్కయి కమీషన్ల కోసమే తమ భూములు, ఆస్తులను నిషేధిత జాబితాలో ఇరికించారని ఆవేదన వ్యక్తంచేశారు. 22ఏ నుంచి భూములు తొలగించాలంటే దళారుల అవతారమెత్తిన కాంగ్రెస్ నాయకులు కమీషన్లు దండుకుంటున్నారని సంచలన విషయాలు బయటపెట్టారు. సామాన్యుల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చి ప్రభుత్వ పెద్దల అనుయాయుల భూములను క్రమబద్ధీకరించుకొనేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటిదే నైతిక బాధ్యత అని తేల్చిచెప్పారు. సారీ చెప్తే సరిపోదని తక్షణమే భూ భారతి పోర్టల్‌లోని తప్పులను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. లేదంటే దగా చేస్తున్న సర్కార్‌కు తగిన బుద్ధిచెప్తామని హెచ్చరించారు. బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దని, బీఆర్ఎస్ అండగా ఉండి పోరాడుతుందని హరీశ్ భరోసానిచ్చారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 40 వేల ఎకరాలను 22ఏ జాబితాలో చేర్చినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాలుగు నెలల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని హరీశ్ గుర్తుచేశారు. అయినా సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చిన్నచిన్న అంశాలకే సీఐడీ, విజిలెన్స్ విచారణ చేపట్టే ప్రభుత్వం, లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తున్న 22ఏ వ్యవహారంపై సీఐడీ విచారణ ఎందుకు జరిపించడం లేదని నిలదీశారు. ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని ముఖ్యమంత్రి భావిస్తే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని తక్షణమే క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
తాండూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎకరాల్లో కొన్ని గజాల చొప్పున బకరాలకు అమ్ముతున్నారని రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరే కాంగ్రెస్ ప్రభుత్వ అసలు రంగును బయటపెట్టిందని హరీశ్ ఎద్దేవాచేశారు. రేవంత్‌రెడ్డి, పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపారం తెలిసి ఉండొచ్చని, బీఆర్ఎస్ నాయకులకు మాత్రం ప్రజల తరఫున ప్రాణాలకు తెగించి పోరాడటం తెలుసుననివ్యాఖ్యానించారు. 22ఏలో చేర్చిన భూములను చట్టబద్ధంగా ఎలా బయటకు తీయాలో తమకు తెలుసని, బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం వెంటపడతామని స్పష్టంచేశారు. పొంగులేటి 10 రోజుల క్రితం ఒక ఎకరం కూడా 22ఏలో పెట్టలేదని చెప్పారని, నిన్ననేమో అధికారులు పొరపాటు చేశారు సారీ అంటున్నారని, ఎంత డూప్లికేట్ మాటలు ఎలా మాట్లాడుతున్నారని నిలదీశారు.