హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తేతెలంగాణ): తమ పార్టీ కార్యకర్తలు తనతోపాటు హరీశ్‌రావు, కేటీఆర్‌పై పెట్రోల్ పోస్తరని, ఇందుకు ప్లాన్ చేశానని.. ఆ ఇద్దరు నేతలు చావకుంటే పట్టుకొనైనా చంపేస్తమని కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో డీజీపీ వెంటనే స్పందించాలని కోరారు. సోమవారం ‘ఎక్స్’లో ఇందుకు సంబంధించిన వీడియోను జతచేసి మాట్లాడారు. ఈ విషయంలో డీజీపీ వెంటనే స్పందించాలన్నారు.
ఈ ఘటనపై అక్టోబర్ 3న గజ్వేల్ ఠాణాలో ఫిర్యాదు చేశామని తెలిపారు. అక్కడి పోలీసు అధికారులు లీగల్ ఒపీనియన్ పేరిట నాలుగు రోజులుగా నాన్చుతున్నారని ఆరోపించారు. అధికారుల విధులను అడ్డగించారనే నెపంతో హైడ్రా బాధితులను అరెస్ట్ చేసినప్పుడు లీగల్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. అంటే కాంగ్రెస్ పాలనలో సామాన్యులకు ఓ న్యాయం.. కాంగ్రెస్ నేతకు మరో న్యాయమా? అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’లో మైనంపల్లి అన్న మాటల వీడియోను పోస్ట్ చేశారు.