‘తల్లికోడి పిల్లలను కాపాడుకున్నట్టే మిమ్మల్ని కాపాడుకుంటా’ అని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పదేపదే శ్రేణులకు భరోసా ఇస్తుంటారు. ‘కుటుంబ పెద్దదిక్కు కోల్పోయిన ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేమందరం మీకున్నాం’ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధైర్యాన్ని ఇస్తుంటారు. ‘ప్రమాద బీమా’ ద్వారా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గొడుగు పట్టిందని ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాల అనుభవం చెప్తున్నది.
ఉద్యమకాలం నుంచి జెండాపట్టి సైనికుల్లా పనిచేస్తున్న కార్యకర్తలకు బీఆర్ఎస్ అడుగడుగునా అండగా ఉంటున్నది. కార్యకర్తలు అకాల మరణం చెందితే బాధిత కుటుంబాన్ని కంటికిరెప్పలా కాచుకొంటున్నది. ఇప్పటివరకూ రూ.100.72 కోట్ల బీమా చెల్లించి, గులాబీ దండుకు తాను రక్షణ కవచంలా నిలిచారు. పార్టీ కార్యకర్తలకు బీమా రూపంలో ఇంత పెద్ద మొత్తం అందజేయడం దేశరాజకీయ పార్టీల చరిత్రలోనే ఓ రికార్డు కావడం విశేషం.
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ‘బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులు’ తెలంగాణ ఉద్యమకాలం నుంచి రాష్ట్ర ఆవిర్భావం జరిగిన తర్వాత పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పదేపదే పార్టీ సమావేశాల్లో చెప్పే మాట ఇది. ‘స్వరాష్ట్ర’ ఆకాంక్షను నెరవేర్చేందుకు కేసీఆర్ చేసిన రాజకీయ యుద్ధంలో ముందుండి పోరాడిన యోధులు కార్యకర్తలు. గులాబీ జెండా గుండెకు హత్తుకొని నిత్యం ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యమయ్యే కార్యకర్తలకు పార్టీ అండగా నిలిచింది. వారి కష్టసుఖాల్లో తోడుంటూ కుటుంబాలకూ అండగా నిలుస్తున్నది. నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం, ప్రజల కోసం క ష్టపడే కార్యకర్తలకు ఏదైనా అనుకోని ప్రమా దం జరిగితే.. ఆ కుటుంబం రోడ్డున పడకుం డా అండగా నిలువాలని 2 లక్షల ప్రమాద బీ మా సౌకర్యం కల్పించారు. గతంలో కొన్ని పా ర్టీలు తమ కార్యకర్తలకు బీమా కల్పించినా.. ఇంత క్రమశిక్షణతో కొనసాగిస్తున్న పార్టీమాత్రం బీఆర్ఎస్సేనని బీమా సంస్థలు కుండబద్దలు కొడుతుండటం విశేషం. 2015లో ప్రారంభమైన ప్రమాద బీమా నిరాఘాటంగా కొనసాగుతున్నది. ఇప్పటికీ 5,036 కుటుంబాలకు బీమా కింద రూ.100 కోట్ల 72 లక్షలు చెల్లించి దేశంలోనే బీఆర్ఎస్ పార్టీ రికార్డును సొంతం చేసుకొన్నది.
బీమాకోసం భవన్లో ప్రత్యేక విభాగం
పార్టీ సభ్యత్వాలు తీసుకొని ప్రమాదవశాత్తు మృతి చెందితే బాధిత కుటుంబానికి నియోజకవర్గ పరిధి ప్రజాప్రతినిధి ద్వారా, లేదా స్వ యంగా వచ్చి సంబంధీకుల బీమా క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు పార్టీ తెలంగాణ భవన్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిరోజూ రాష్ట్ర నలుమూలల నుంచి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే వారికి ఉచిత భోజనాల ఏర్పాటు సైతం చేశారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చే కార్యకర్త కుటుంబాన్ని సాదరం గా గౌరవించుకొనేలా కౌంటర్ ఏర్పాటు చేశా రు. ఇక్కడ వివరాలను రాసుకొని, ఇన్సూరెన్స్ కంపెనీలతో సంప్రదింపులు జరపడంతోపాటు క్లెయిమ్స్ సకాలంలో వచ్చేలా చూస్తామని ఈ విభాగం బాధ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి, విజయ డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్‌కుమార్ పేర్కొన్నారు.
బీమాకు ఎవరు అర్హులు?
పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతీ కార్యకర్త (సాధారణ లేదా క్రియాశీల సభ్యత్వం) రూ. 2 లక్షల ప్రమాద బీమాకు అర్హులేనని పార్టీ ఇన్సూరెన్స్ విభాగం పేర్కొన్నది. అయితే సహజమరణాలు, గుండెపోటు మరణాల వంటివి బీమా పరిధిలోకి రావని ఆ విభాగం స్పష్టం చేసింది. 69 ఏండ్లలోపు (సహజంగా రైతుబీమా సైతం 59 ఏండ్లే) వయసు ఉండి రోడ్డు ప్రమాదం, విద్యుదాఘాతం, పాముకాటు, ప్రమాదంలో కాలిన గాయాలపాలై మృతి చెందినవారికి, ఏదైనా ఎత్తు నుంచి కింది పడి మరణించిన వారికి, పిడుగుపాటు, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయినా, రైలు ప్రమాదాల్లో మరణించిన బీమా వర్తిస్తుంది.
ఎలా క్లెయిమ్ చేయాలి?
కార్యకర్త మరణించిన 60 రోజుల గడువులో కుటుంబ సభ్యులు తెలంగాణ భవన్లో నిర్దేశిత పత్రాలు సమర్పించాలి. గడువు దాటిన తర్వాత బీమా కంపెనీలు క్లెయిమ్స్‌ను పరిగణనలోకి తీసుకోవు.
ఏ ఏడాది ఎంతమందికి క్లెయిమ్స్
2015-16 సంవత్సరం నుంచి 2022-23 సంవత్సరం వరకు వివిధ ప్రమాదాలబారిన పడి మరణించిన 5,574 మంది పార్టీ కార్యకర్తలకు సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీలకు క్లెయిమ్స్ సమర్పించగా, అందు లో 5,036 మంది కార్యకర్తల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పన ఆర్థిక సహాయం అందింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 186 క్లెయిమ్స్ తిరస్కారానికి గురికాగా, 564 క్లెయిమ్స్ వివిధ దశల్లో ఉన్నాయి. సంవత్సరాలవారీగా సమర్పించిన క్లెయిమ్స్, పొందిన క్లెయిమ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించిన పార్టీ చెల్లించిన మొత్తం, ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి పార్టీ కార్యకర్తలకు చేరిన మొత్తం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
బీమా డబ్బులతో బాకీ తీర్చిన
మా తల్లి సుందిళ్ల రాజక్కకు బీఆర్ఎస్ పార్టీ అంటే మస్తు ఇష్టముండె. పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నది. ఎక్కడా ఏ ప్రోగ్రాం జరిగినా పోయేది. జ్వరం రావడంతో 2023, ఫిబ్రవరి 16న చెన్నూర్ పట్టణంలోని ఎల్లక్కపేటలోని ప్రభుత్వ దవాఖానకు పోయింది. ప్రభుత్వ దవాఖాన దగ్గర ఆటో దిగి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు వచ్చి ఢీకొట్టింది. మూడు రోజలు చికిత్స పొందిన తర్వాత చనిపోయింది. అప్పుచేసి చికిత్స చేయించినం. మా ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలిపించి రూ. 2 లక్షల చెక్కు ఇచ్చిన్రు. గా డబ్బులతో అమ్మ చికిత్సకు అయిన అప్పు తీర్చిన.
– సుందిళ్ల రాజశేఖర్, నర్సక్కపేట, మంచిర్యాల
కంటికి రెప్పలా కాపాడుకుంటాం‘కుటుంబ పెద్దదిక్కును కోల్పోయిన
పార్టీ కుటుంబీకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేమందరం మీకున్నం. మీ ఇంటివాడు దూరం అయ్యాడని మీరు ఎట్టిపరిస్థితుల్లో బాధ పడకూడదు. మనందరిదీ చాలా పెద్ద కుటుంబం. 60 లక్షల మంది కుటుంబం. మనందరికి పెద్దిదిక్కుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నరు. అందరినీ సీఎం కేసీఆరే ఆదుకుంటరు. నిబ్బరంగా.. మనోధైర్యంగా ఉండాలి. మీకే సమస్య ఉన్నా మన పార్టీ చూసుకుంటది’.
-(తెలంగాణ భవన్లో 2021 ఆగస్టు 4న కార్యకర్తల కుటుంబసభ్యులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ )
నా ఇంటిని నిలబెట్టింది
మాది నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామం. నా భర్త యాతవాకిళ్ల లచ్చయ్య. మాకు ఇద్దరు కొడుకులు, కూతురు. మా ఆయనకు పార్టీ అంటే ప్రాణం. దురదృష్టవశాత్తు వరికోత మిషన్ తగిలి చనిపోయిండు. మాకు సెంటు భూమి కూడా లేదు. నా భర్తకు పార్టీ బీమా చేసిందని మా ఊరి నాయకులు చెప్పిన్రు. ఆయన పోయిన కొద్దిరోజులకే రూ.2 లక్షల చెక్కును ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి స్వయంగా మా ఇంటికి వచ్చి ఇచ్చారు. పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను పట్టించుకోలేదు.కానీ బీఆర్ఎస్ పార్టీ నా ఇంటిని మళ్లీ నిలబెట్టింది. కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
– యాతవాకిళ్ల ఈదమ్మ, దిర్శించర్ల, నేరేడుచర్ల మండలం
బిడ్డ పెండ్లికి డబ్బులు దాచిన
మాది బుధవార్‌పేట్ కాలనీ. నేను బీడీలు చుడుతుంట. నా భర్త నాయన్నగారి నరేందర్. మాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ప్రైవేటు వ్యాపారం చేస్తూనే నా భర్త బీఆర్ఎస్ పార్టీలో చురుగ్గా పనిచేసేవాడు. పదేండ్లనుంచి పార్టీలో తిరుగుతుండు. నిరుడు నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిండు. అప్పటికే పార్టీ నా భర్త పేరిట రూ.2 లక్షల బీమా చేయించింది. ఆయన చనిపోయినంక ఆ పైసలస్తే వాటితోనే నాబిడ్డ పెండ్లిజేసిన. నాకు బీడీ పింఛన్ వస్తున్నది.
-నాయన్నగారి లావణ్య, నిర్మల్
బీఆర్ఎస్సే బతుకుదారి చూపింది
ఆమె పేరు చిన్నాల మౌనిక. ఆమెకు పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామానికి చెందిన రమేశ్‌తో పెండ్లి అయ్యింది. ఐదేండ్ల పాప, మూడేండ్ల కొడుకు ఉన్నాడు. కొడుకు పుట్టిన ఏడాదికే రమేశ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటికీ మౌనిక వయసు 23 ఏండ్లే. చిన్నతనంలోనే భర్త దూరమ వడంతో పిల్లలను ఎలా సాకాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడింది. అప్పుడే మంత్రి ఎర్రబెల్లి బీమా కింద మంజూరైన 2లక్షల చెక్కు అందించారు. అన్నివిధాలా ఆదుకొంటానని దయాకర్‌రావు భరోసా ఇచ్చారు. అలాగే, రైతు బీమాకింద రూ.5 లక్షలు అకౌంట్లో జమ అయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ ద్వారా అందిన మొత్తం రూ.7 లక్షలతో ఆమె బతుకుకు దారి కనిపించింది.
పిల్లల కోడిలెక్క కాపాడుకుంటా
తల్లికోడి తన పిల్లలను కాపాడుకున్నట్టే నేనూ మిమ్మల్ని కాపాడుకుంటా. కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తా. మీరు లేకపోతే నేను లేను. మీరు లేక పోతే తెలంగాణ లేదు. మీరే నా బలం. బలగం. నన్ను నడిపించే శక్తి మీరే. ఊరూరా కథానాయకులై కదిలారు. పార్టీ కోసం కష్టపడ్డారు. రాష్ట్రం కోసం పరితపించారు. అటువంటి మీకు నేనెమిచ్చినా రుణం తీరదు.
-సీఎం కేసీఆర్
ఇన్సూరెన్స్ పైసలే ఆదుకున్నయి
నా భర్త బాలయ్యకు పార్టీ అంటే ప్రాణం. కొత్తకోట బైపాస్ రోడ్డు దాటుతుండగా లారీ వచ్చి ఢీకొట్టడంతో ప్రాణం పోయింది. నాకు కాలు విరిగింది. కొన్ని దినాలు అట్లనే దవాఖానాకు తిరిగినం. డాక్టర్లు బాగైతదని చెప్పిన్రు. కానీ ఆర్నెళ్లు అయినంక కాలు మొత్తం తీసేసిన్రు. ఆ టైమ్‌ల పార్టీ వాళ్లు, ఎమ్మెల్యే ఇన్సూరెన్స్ పైసలు ఇచ్చిండ్రు. ఆ పైసలతోటి కాలు తీయించినం. మా కుటుంబాన్ని పార్టీ ఇన్సూరెన్స్ పైసలే ఆదుకున్నయి.
– కుమ్మరి బాలమ్మ, రేచింతల, ఆత్మకూరు మండలం, వనపర్తి
బిడ్డపెండ్లికి పెట్టుకున్న..
ఆమె పేరు బొంతల స్వరూప. ఆమెది పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ధర్మారం. కొడుకు, కూతురు ఉన్నారు. ఆమె భర్త ఆర్జయ్య మత్య్స కారుడు. బీఆర్ఎస్లో క్రియాశీలకంగా పనిచేసేవాడు. నిరుడు చేపలు పట్టేందుకు వెళ్లి, చనిపోయిండు. స్వరూప బతుకు ఆగమైంది. గుంట భూమి కూడా లేదు. ఇద్దరు పిల్లలను ఎలా సాదాలో తెలియక నైరాశ్యంలో మునిగిపోయింది. పెద్దపల్లి జడ్పీ చైర్పర్సన్ పుట్ట మధు బీఆర్ఎస్ బీమా కింద వచ్చిన 2లక్షల చెక్కు చేతిలో పెట్టిండు. ఆ డబ్బులను స్వరూప తన బిడ్డ పెండ్లి కోసం డిపాజిట్ చేసింది. ఇప్పుడు కొడుకు సంతోష్, కూతురు శ్రావ్య ఇద్దరు డిగ్రీ చదువుతున్నరు. వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకొంటున్నది.
ఏ పార్టీ ఇలా ఆదుకోలే
దేశంలో ఏ పార్టీ బీఆర్ఎస్లా ఆదుకున్న దాఖలాలు లేవు. ప్రతి కార్యకర్తను ఆదుకోవాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన. తెలంగాణ భవన్లో పార్టీ వివిధ విభాగాలతోపాటు ఇన్సూరెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి, ప్రధాన కార్యదర్శికి ఈ విభాగం పర్యవేక్షణ బాధ్యతను అప్పగించిన పార్టీ మరొకటి లేదు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిరంతరం ఈ విభాగాన్ని పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు చేస్తున్నారు.
-సోమా భరత్‌కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఇన్సూరెన్స్ విభాగం ఇన్చార్జి
సమస్యల నుంచి గట్టెక్కించిన బీమా
నిజామాబాద్ జిల్లా సాలూరా మండల కేంద్రానికి చెందిన మోండూర్ వీరయ్య ఈ ఏడాది జనవరిలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతిచెందాడు. వీరయ్య మరణంతో ఆ నిరుపేద కుటుంబంలో చీకట్లు అలముకున్నాయి. భర్తను కోల్పోయిన శివరాణికి.. ఒక పక్క అప్పులు, మరోపక్క ఇద్దరు చిన్నారుల పోషణ బాధ్యత కలవరపెట్టింది. వీరయ్యకు పార్టీ బీమా కింద రూ.2 లక్షల చెక్కు వచ్చింది. జూలై 13న బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి భార్య ఫాతిమా.. వీరయ్య కుటుంబానికి డబ్బులు అందించడంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కింది. ‘నా భర్త పోయిన తర్వాత కష్టాల్లో పడ్డం. మాకు బీఆర్ఎస్ నాయకులు అండగా నిలబడ్డరు. పార్టీని ఎప్పటికీ యాది మరువం.’ అని శివరాణి చమర్చిన కండ్లతో చెప్తున్నది.