KTR | హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ రాష్ట్రం దేశానికే దీపస్తంభం. దానిని ఆరిపోనివ్వం.. ఆగిపోనివ్వం. ప్రజల పక్షాన నిలబడ్తాం. తెలంగాణ సమిష్టి సంపద. అది ఒక వ్యక్తిదో, ఒక పార్టీతో కాదు. నాలుగు కోట్ల ప్రజల సమష్టి సంపద’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణను ఎవరు అగౌరవపరిచే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పాలనపై అసెంబ్లీ సాక్షిగా తామే ఏ విచారణకైనా సిద్ధమని చెప్పామని గుర్తుచేశారు. తప్పుచేస్తే భయపడ్తాం కానీ, ఏ తప్పు చేయకున్నా నిందలేస్తే సహించబోమని హెచ్చరించారు. ‘మా మీద రాజకీయ కక్ష ఉంటే తీర్చుకోండి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చకండి’ అ హితవు పలికారు. ఆదివారం తెలంగాణ భవన్లో ‘స్వయం పాలన ప్రారంభమైన తొమ్మిదిన్నరేండ్ల అనతికాలంలో కేసీఆర్ ప్రభుత్వ దార్శనికతతో యావత్ తెలంగాణ ప్రజలు చెమటోడ్చి సృష్టించిన సంపదపై స్వేదపత్రం’ విడుదల చేశారు. ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ నాయకత్వంలోని పరిపాలనను బద్నాం చేసే విధంగా, ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాల విడుదల పేరుతో బురదజల్లిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. శాసనసభలో తమ పార్టీ నాయకులు జగదీశ్‌రెడ్డి, హరీశ్‌రావు, తాను కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణలకు, విమర్శలకు దీటుగా సమాధానమిచ్చామని చెప్పారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతునొక్కి శ్వేతపత్రాలు అని హడావుడి చేసి చివరికి వాయిదా వేసుకొని ప్రభుత్వం పారిపోయిందని విమర్శించారు. ప్రభుత్వ ఆరోపణలపై బాధ్యత కలిగిన పార్టీగా గత పదేండ్లలో తామేం చేశామో.. ఎట్లా చేశామో అనే విషయాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమమీదే ఉన్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ఆస్తులు సృష్టించటం మాత్రమే కాదని, తెలంగాణకు అస్థిత్వాన్నే సృష్టించిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు.
ఏ విచారణకైనా సిద్ధం
ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్దక సాధక ప్రాజెక్టుగా కాళేశ్వరం గుర్తింపు తెచ్చుకున్నదని, అది దాచేస్తే దాగని సత్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒక్క బరాజ్‌లో ఎక్కడో ఒక దగ్గర చిన్న నిర్మాణ లోపం ఉంటే సరిచేయాలని, అదే సమయంలో ‘జ్యుడీషియల్ ఎంక్వైరీ చేస్తాం’ అని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ‘బరాబర్ విచారణ చేసుకోండి. తప్పు జరిగితే ఏ విచారణకైనా మేం సిద్ధం. దాంట్లో ఇబ్బందిలేదు. కానీ, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిందించే పరిస్థితి తీసుకురాకండి’ అని ప్రభుత్వానికి సూచించారు. ‘మా మీద రాజకీయ కక్ష ఉంటే తీర్చుకోండి. మమ్మల్ని తిట్టండి. అంతేగానీ రాష్ట్ర, జాతి సంపదను మాత్రం అవమానించవద్దు. పెట్టిన శ్రమను, చిందించిన చెమటను చిన్నగ చేసి చూపొద్దు’ అని హితవు పలికారు. కేసీఆర్ సృష్టించిన సంపదను విస్మరించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన డొల్ల రాజకీయాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ‘ఆస్తులంటే నిర్మాణాలే కాదు. ప్రజల్లో పెరిగిన జీవన ప్రమాణాలు. ప్రతి కుటుంబంలో పెరిగిన ప్రతిష్ఠ, ఆత్మవిశ్వాసం’ అని కేటీఆర్ తేల్చి చెప్పారు.
అందరితో ఒక్కడు.. అదే కేసీఆర్
1969 ఉద్యమంలో 370 మంది చనిపోయినా, ఆ తరువాత 30-32 ఏండ్లు సమైక్యవాదులు తెలంగాణపై చెలరేగిపోయినా తెలంగాణలో ఒక్క కాంగ్రెస్ నాయకుడు పెదవి విప్పలేదని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ అన్ని రంగాల్లో తీరని వివక్షకు, అన్యాయానికి గురైందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంతోమంది కవులు, కళాకారులు, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మేధావులంతా తమ ఆర్తిని, ఆవేదనను వ్యక్తం చేసినా ఎన్నడూ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కండ్లల్లో ఇక నీళ్లింకిపోతయనే పరిస్థితుల్లో పిడికిలి బిగించి సమర శంఖం పూరించిన నాయకుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఒక్కరేనని స్పష్టం చేశారు. ఉద్యమంలో ఏనాడూలేని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎన్నైనా మాట్లాడతారని, తమ వల్లనే తెలంగాణ వచ్చిందని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.
‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్ని దీక్షలు, ఆత్మ బలిదానాలు, సాగరహారాలు, మిలియన్ మార్చ్‌లు జరిగాయో తెలంగాణ సమాజానికి తెలుసు. ఇవాళ కొంతమంది నిర్బంధమని, నియంతృత్వమని అంటున్నారు. నిజానికి సమైక్య పాలకులే నియంతలు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే అంధకారం అవుతుందని కట్టెలు పట్టుకొని చెప్పినవాళ్లకు తొత్తులుగా పనిచేసినవాళ్లు మాపై నిందలేస్తారా?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. నేరపూరిత నిర్లక్ష్యం (క్రిమినల్ నెగ్లిజెన్సీ)తో, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో తెలంగాణను నాశనం చేసే ప్రయత్నం చేసింది ఎవరు? అని నిలదీశారు. సమైక్య రాష్ట్రంలో క్షమించలేని, క్షమించరాని, జీవన విధ్వంసానికి పాల్పడ్డా ఏ కాంగ్రెస్ నాయకుడు మాట వరుసకు కూడా నోరు విప్పి ప్రశ్నించలేదని ధ్వజమెత్తారు.
శ్వేతపత్రాల పేరుతో విఫలయత్నం
శ్వేతపత్రాల పేరుతో తెలంగాణను విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆర్థిక చిక్కులు చుట్టుముట్టి, రాజకీయ కుట్రలు పేట్రేగిపోయిన సందర్భాలను గుర్తు చేశారు. నాడు కూడా తెలంగాణను విఫల రాష్ట్రంగా చిత్రీకరించాలని కుట్ర చేశారని గుర్తుచేశారు. ‘తెలంగాణ హిమాలయమంత ఎత్తులో ఆదర్శంగా రాష్ట్రంగా ఉన్నది. ఇప్పుడు మరోసారి రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లల్లోనే బెర్లిన్ గోడను కూల్చి ఈస్ట్, వెస్ట్ జర్మనీలను కలిపినట్టు రేపు తెలంగాణను తిరిగి ఆంధ్రాలో కలుపలేమా? అనే వాదనను బలంగా ఎదుర్కొన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్తిరపరిచే ప్రయత్నం, ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం వంటి అనేక కుట్రలు జరిగినా వాటిని చీల్చుకొని తెలంగాణ నిటారుగా నిలబడింది’ అని తెలిపారు.
మాకే అన్నీ తెలుసని ఏనాడూ అనుకోలే..
విభజన చట్టం అమలు కష్టాలు, ఉద్యోగుల పంపకాల్లో ఆటంకం, 2,700 మెగావాట్ల విద్యుత్తులోటు, వారసత్వంగా సంక్రమించిన సమస్యలు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చుట్టుముట్టాయని కేటీఆర్ తెలిపారు. వీటన్నింటినీ అధిగమించేందుకు తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం ఎట్లా చేయాలనే సవాళ్లు ఎదుర్కొన్నామని చెప్పారు. చిమ్మ చీకట్ల నుంచి ముందుకు సాగేందుకు పటిష్ఠమైన ఆర్థిక క్రమశిక్షణతో.. ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకున్నామని వివరించారు. బీహార్ రాష్ట్రంలో ఉన్న జీఆర్ రెడ్డి అనే ఆర్థికవేత్తను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించుకొని, కోల్ ఇండియా సీఎండీగా పనిచేస్తున్న సీనియర్ అధికారి నర్సింగరావును సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టుకొని ముందుకు సాగామని గుర్తుచేశారు. ‘మాకే అన్నీ తెలుసు.. మేమే చాలా గొప్పవాళ్లం’ అనే రీతిలో కాకుండా నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందని భావించామని తెలిపారు. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రచించుకొని ముందుకు సాగామని వివరించారు. అయితే తొమ్మిదిన్నరేండ్ల పాలనలో కరోనా, పెద్దనోట్ల రద్దు వంటి ఆర్థిక ఆటంకాలతో బీఆర్ఎస్ పార్టీ నికరంగా పాలించింది ఆరున్నరేండ్లేనని పేర్కొన్నారు.
బట్ట..పొట్ట మొదటి ప్రాధాన్యం
ప్రాధాన్య క్రమాన్ని నిర్ణయించుకొని, అందుకు తగిన నిధుల కూర్పును అంచనావేసుకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ తెలంగాణ ప్రగతి ప్రయాణాన్ని సాగించామని కేటీఆర్ తెలిపారు. వారసత్వంగా సంక్రమించిన అప్పుల లెక్కలు తీసి, వాస్తవిక ఆర్థిక క్రమశిక్షణ పాటించామని చెప్పారు.
మొదటి ప్రాధాన్యం -ఆసరాతో సంక్షేమం
రెండో ప్రాధాన్యం -విద్యుత్తు రంగం
మూడో ప్రాధాన్యం- వ్యవసాయ రంగం
నాలుగో ప్రాధాన్యం -చెరువుల పునరుద్ధరణ, తాగునీటి కల్పన
ఐదో ప్రాధాన్యం- పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి
ఆరో ప్రాధాన్యం -తెలంగాణకు హరితహారం
ఎన్నికలు ముఖ్యం కాదు.. రాబోయే తరాలు ముఖ్యం
బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలు ముఖ్యం కాదని, రాబోయే తరాలే ముఖ్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘రాబోయే ఎన్నికలు కాదు.. రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకొని పటిష్ఠమైన పునాదులు వేసుకున్నాం. కరోనా వచ్చినా, పెద్దనోట్ల రద్దు వంటి అనేక అవాంతరాలు వచ్చినా రాష్ట్ర సొంత ఆదాయ వనరులను పెంచుకుంటూ ముందుకు సాగాం. కేంద్ర ఆర్థిక పరిమితులకు (ఎఫ్ఆర్బీఎం) లోబడి అప్పులు తీసుకొచ్చాం. దేశంలో తెలంగాణను నంబర్ వన్‌గా నిలబెట్టాం. 2014లో తెలంగాణలో 21.92 శాతం ఉన్న బహుముఖ పేదరికాన్ని 5.8 శాతానికి తగ్గించాం. దేశంలో పేదరికాన్ని గణనీయంగా తగ్గంచిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఇదే మా నిబద్ధతకు, నిఖార్సైన పాలనకు సంకేతం. తెలంగాణ ఆవిర్భవించిన పదేండ్లల్లోనే అద్భుతాలు సృష్టించింది. దేశానికే దిక్సూచీగా 10 శాతం గ్రీన్‌ఫండ్ పెట్టింది. తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది అనేస్థాయికి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే’ అని స్పష్టంచేశారు. హైదరాబాద్ స్టేట్‌ను బలవంతంగా ఆంధ్రాలో కలుపుకొన్న 1956 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా జరిగిన ఉద్యమఘట్టాలు, వాటి నేపథ్యాలను కేటీఆర్ తన పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా కండ్లకు కట్టారు.
నాటి తెలంగాణ వెతలివి..
తెలంగాణ పది జిల్లాలతో రాష్ట్రంగా అవతరించినాడు హైదరాబాద్ మినహా మిగితా 9 జిల్లాలు కరువు ప్రాంతాలే. వీటికి బీఆర్జీఎఫ్ (బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్‌ఫండ్) నిధులు వచ్చేవి వాస్తవం కాదా? తెలంగాణ సంక్షుభిత పరిస్థితికి ఇంతకన్నా కొలమానం ఏం కావాలి?
నల్లగొండ జిల్లా ప్రజలు ఫ్లోరోసిస్‌తో అతలాకుతలమైంది నిజం కాదా? ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నల్లగొండలో 2 లక్షల మంది ఫ్లోరోసిస్‌తో ఉండటం నోమాన్స్ ల్యాండ్ (మానవ రహిత ప్రాంతంగా) మిగిలిపోతుందని హెచ్చరించింది నిజం కాదా? నాటి ప్రధాని వాజపేయి టేబుల్ మీద అంశల స్వామిని జలసాధన సమితి నేత దుశ్చర్ల సత్యనారాయణ పడుకోబెట్టి ‘ఇదీ మా దుస్థితి’ అని నినదించినా సమస్య పరిష్కారం కాని దైన్యం నిజం కాదా?
కిలోమీటర్ల కొద్దీ నడిచిపోయినా తాగునీరు దొరకని దుస్థితి. నెర్రలు బారిన నేలలు. పగలని గుండెలేదు. చెదరని స్వప్నం లేదు. తడవని కండ్లులేవు.
దేశం మొత్తంలోనే మహబూబ్‌నగర్ జిల్లా వెనుకబడిన జిల్లా. ఈ జిల్లా నుంచే 14 లక్షల మంది ప్రజలు వలస పోయేవారు. వేల సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు నిజం కాదా?
ఇవాళ తెలంగాణకు 14 రాష్ర్టాల నుంచి 35 లక్షల మంది వచ్చి జీవనోపాధి పొందుతున్నది నిజం కాదా?
– కేటీఆర్ ప్రశ్నలివి
వీటినెలా లెక్కిస్తరు?
10 ఏండ్లు.. 5 విప్లవాలు
హరిత విప్లవం
ధాన్యం, ఇతర పంటల ఉత్పత్తి విలువ రూ.1.50 లక్షల కోట్లు. ధాన్యం దిగుబడి 68 లక్షల టన్నుల నుంచి 3.5 కోట్ల టన్నులకు పెరుగుదల
గులాబీ విప్లవం:
15 వేల కోట్ల సంపద సృష్టి 2012లో గొర్రెల సంఖ్య 12.8 మిలియన్లు..2019లో 19.1 మిలియన్లు
నీలివిప్లవం
30 వేల కోట్ల సంపద సృష్టి 2014-15లో చేపలు, రొయ్యల ఉత్పత్తి 2.68 లక్షల టన్నులు.2023 నాటికి చేపలు, రొయ్యల ఉత్పత్తి 3.90 లక్షల టన్నులు
శ్వేతవిప్లవం
పాల ఉత్పత్తి 2014లో 4.2 మిలియన్ టన్నులు 2021-22లో 5.8మిలియన్ టన్నులు
పసుపు విప్లవం
2014 తరువాత 27,376 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు 2025 నాటికి 20 లక్షల ఎకరాలకు పెంచాలని లక్ష్యం