KTR | జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా రేపు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ హక్కుల హననం గురించి.. అప్రజాస్వామికమైన పోకడల గురించి నిరసన తెలిపేందుకు రచించిన అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చాం. ఇక్కడికి వచ్చి చూస్తే.. ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం వద్దకు వెళ్లి కూర్చునేందుకు అవకాశం లేకుండా గేట్లు మూసేశారు. ఆ మహానుభావుడిని సంకెళ్లతో బంధించిన నీచమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా.. పేరుకేమో ప్రజాపాలన.. చేసేవన్నీ అప్రజాస్వామిక పనులు అన్నట్లుగా ఉంది’ అని విమర్శించారు.
‘ఇవాళ ఏకపక్షంగా జగదీశ్‌రెడ్డి గొంతునొక్కడం అంటే.. జగదీశ్‌రెడ్డి గొంతునొక్కడం కాదు.. ఆయన ఒక్కడికి జరిగిన అవమానం కాదు. ఈ రాష్ట్రంలోని రైతాంగం తరఫున, రాష్ట్రంలోని ఆడబిడ్డల తరఫున నెలకు రూ.2500 కావాలని గొంతు విప్పినందుకు.. రైతాంగం తరఫున రుణమాఫీ జరుగలేదని, ఎండుతున్న పంటల విషయంలో నిలదీసినందుకు, ప్రజల తరఫున పెన్షన్ల గురించి, అమలు కానీ ఆరు గ్యారంటీలు, 420 హామీల గురించి ప్రశ్నించినందుకు తట్టుకోలేక ప్రభుత్వం ఓ కుయుక్తితో సస్పెండ్ చేశారు. ఇవాళ వాళ్లు అనుకుంటున్నరు.. కేవలం ఒక గొంతునొక్కినందుకు.. మా పార్టీ సభ్యుడి ప్రసంగానికి అంతరాయం కలిగించినందుకు ఏదో సాధించామని వారు భ్రమపడుతున్నరు. కానీ, రాష్ట్రంలోని ప్రజలు అన్నీ గమనిస్తున్నరు. పదిహేను, పదహారు నెలల్లో కేవలం 20శాతం కమిషన్లు, ఢిల్లీకి మూటలుపంపడంపై ఉన్న దృష్టి.. ఈ రాష్ట్రంలో పేదలకు మేలు చేయాలనే విషయంలో లేదు. ఈ విషయం ప్రజలకు అర్థమైంది. అందుకే ప్రజలు సీఎంను ఎక్కడికక్కడ ప్రజలు శాపనార్థాలు పెడుతున్నరు’ అన్నారు.
‘బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా, సీఎం, ఈ ప్రభుత్వం అహంకార, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిస్తున్నాం. బడ్జెట్లో అన్ని అంశాలపై ప్రశ్నించబోతున్నామని కాంగ్రెస్‌కు తెలుసు. మరి బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఉంటే.. ప్రజల తరఫున గట్టిగా దాడి చేస్తారు.. ప్రశ్నిస్తారని వారికి తెలుసు. కమీషన్లు, కాంట్రాక్టులు, 420 హామీలు, ఢిల్లీకి మూటలు అన్నీ వెలుగులోకి వస్తాయనే.. మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నరు. తప్పకుండా దీనికి ప్రజలతో పాటు మేం కూడా సమాధానం చెబుతాం. రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతాం. మా సభ్యుడి నొక్కినందుకు ఈ ప్రభుత్వం ఇంతకు ఇంత అనుభవిస్తుంది. భవిష్యత్‌లో తప్పకుండా వారికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదు’ అని కేటీఆర్ అన్నారు.