ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చిప్ దొబ్బింది.. దిల్‌సుఖ్‌నగర్‌లో విమానాలు దొరుకుతయంటడు.. తెలంగాణలో భాక్రానంగల్ ఉందంటడు. హైదరాబాద్ చుట్టూ మూడు వైపులా సముద్రం ఉందంటడు.. రాష్ట్రం మొత్తాన్ని ఆగం చేస్తున్నడు.
-కేటీఆర్
KTR | రంగారెడ్డి, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అంటేనే భారతీయ రైతు సమితి అని, తాము ఎలాగూ రైతుల కోసం పోరాటం చేస్తామని, కానీ.. రైతుల పక్షాన పోరాడాల్సిన కమ్యూనిస్టులు ఎక్కడ? అని, రైతు సంఘాల నోళ్లెందుకు మూతబడ్డాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. భూముల విషయంలో ఫార్మాసిటీ రైతులనే కాకుండా అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, ఇప్పుడు వానకాలం పెట్టుబడి సాయం రూ.15 వేలకు కూడా రాంరాం చెప్పిందని మండిపడ్డారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రమీద గార్డెన్లో బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రాష్ట్ర యువజన నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం కార్యకర్తల దసరా సమ్మేళనాన్ని ఆదివారం అట్టహాసంగా నిర్వహించగా, కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికలప్పుడు అశోక్‌నగర్ వెళ్లి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని, రెండు నెలలు గడిస్తే ఏడాది అవుతదని, ఉద్యోగాల మాటేమోగానీ..రాహుల్‌కు ప్రతిపక్ష నేతగా, రేవంత్‌రెడ్డికి సీఎంగా ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. జీవో 29తో రిజర్వేషన్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకూ అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు.
రైతుల నోట్లో రేవంత్ మట్టి
వానకాలం రైతు భరోసాకు రాంరాం చెప్పి రైతుల నోట్లో రేవంత్‌రెడ్డి మట్టికొట్టాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖరీఫ్ రైతు భరోసా ఎగ్గొడుతున్నామని సిగ్గులేకుండా వ్యవసాయ మంత్రి తుమ్మల చావు కబురు చల్లగా చెప్పిండని విమర్శించారు. రైతు భరోసాను ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్ర ఇది అని మండిపడ్డారు. ‘స్కూళ్లల్లో చాక్‌పీస్‌లకు, దవాఖానల్లో మందులకు, పోలీసుల బండ్లలో పెట్రోల్‌కు పైసలు లేవంట..కానీ మూసీలో పోసేందుకు లక్షా యాభై వేల కోట్లు ఉన్నాయట!’ అని ఎద్దేవాచేశారు. మూసీ శుద్ధి కోసం కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా నీళ్లు తెచ్చి నదికి అనుసంధానం చేయాలని నిర్ణయించడంతోపాటు బీఆర్ఎస్ హయాంలో ఎస్టీపీలు నిర్మించామని గుర్తుచేశారు. ఢిల్లీకి మూటలు పంపేందుకే మూసీ నాటకం ఆడుతున్నారని విమర్శించారు.
అన్నీ అబద్ధపు హామీలే
‘ఎన్నికల ముందు రైతు కూలీలు, కౌలు రైతులకు ఆర్థిక సాయం అన్నడు. బోనస్ అని బోగస్ మాటలు చెప్పిండు’ అని రేవంత్‌పై కేటీఆర్ మండిపడ్డారు. ‘మహిళలకు తులం బంగారం అంటివి ఏ మైంది?’ అని నిలదీశారు. 11 నెలల్లో 4 లక్షల పెండ్లిళ్లు అయ్యాయని, త్వరలో మరో 2 లక్షల పెండ్లిళ్లు అవుతాయని, ఇప్పటికైనా తులం బంగారం కార్యక్రమాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి కాదని.. గోల్మాల్రెడ్డి అని విమర్శించారు.
రైతుల పక్షాన పోరాడుతాం
ఫార్మాసిటీ..ఫోర్త్సిటీలపై సీఎం రేవంత్‌రెడ్డి దొంగ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడని కేటీఆర్ ఆగ్రహంవ్యక్తం చేశారు. కాలుష్యం లేకుండా గ్రీన్ ఫార్మాసిటీని నిర్మించేందుకు కేసీఆర్ కృషిచేశారని పేర్కొన్నారు. ఎనిమిదేండ్లు కష్టపడి రైతులను ఒప్పించి, మెప్పించి 14 వేల ఎకరాలు సేకరించామని చెప్పారు. భూములు గుంజుకోబోమని ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి, సీతక్క, కోదండరెడ్డి తప్పుడు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. ‘దమ్ముంటే ఫార్మాసిటీని రద్దు చెయ్..రైతుల భూములను తిరిగి ఇవ్వు’ అని సీఎంకు కేటీఆర్ సవాల్ విసిరారు. చట్టం ప్రకారం ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములను వేరేదానికి వాడడానికి వీలులేదని, సీఎం రేవంత్‌రెడ్డి ఫార్మాసిటీ విషయంలో కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుందని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టంచేశారు. ఫార్మాసిటీ రైతులు సహా అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, గల్లీగల్లీ తిరిగి కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. గ్రామగ్రామాన మనమే కథానాయకులుగా మారాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. దసరా సమ్మేళనంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు క్యామ మల్లేశ్, ప్రశాంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ వస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్ అంటరని కేసీఆర్ ముందే చెప్పిండ్రు. ఇప్పుడు అదే జరిగింది
-కేటీఆర్
గతంలో చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి లాంటి వాళ్లతోనే కొట్లాడి రాష్ర్టాన్ని తెచ్చుకున్నం. ఈ చిట్టినాయుడెంత? చిట్టి నాయుడుకు ఏం తెల్వది. తిట్టుమంటే మాత్రం తిడుతడు.
-కేటీఆర్
ఎన్నికల ముందు మూడు పంటలకు సాయం అందించాలని చెప్పిండు. కేసీఆర్ రూ.10వేలు ముష్టి వేస్తున్నడు.. మేము రూ.15వేలు ఇస్తామని బడాయి కొట్టిన సిపాయి ఇప్పుడు ఎక్కడ?
-కేటీఆర్