Minister KTR | డిసెంబర్ 3న యావత్ తెలంగాణ గులాబీమయం కాబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ప్రగతిభవన్‌లో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ వెలువరించిన ‘కాంగ్రెస్ చేసిందేంది’ అనే సంకలనాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో ముచ్చటగా మూడోసారి గులాజీ జెండా ఎగురబోతున్నదన్నారు. ప్రజలు ఎంత స్థితప్రజ్ఞత కలవారో గతంలో రెండు ఎన్నికల్లో రుజువైందని, కొనసాగుతున్న అభివృద్ధిని మరింత ముందుకుసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే సాధ్యమని ప్రజలకు బాగా తెలుసునన్నారు.
కాంగ్రెస్ ఏం చేసిందో.. ఏం చేయగలదో అంతా ప్రజలకు తెలుసునని చెప్పారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కాంగ్రెస్ వల్ల కాదని.. డిసెంబర్ 3న తెలంగాణ అంతా గులాబీమయం కాబోతున్నదని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ అంతే తెలంగాణ స్వీయ అస్తిత్వానికి ఆత్మలాంటిదని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కేసీఆర్‌ను ప్రజలు గెలిపించుకుంటారన్నారు. తెలంగాణను ధ్వంసం చేసిందెవరో.. తెలంగాణను పునర్నిర్మిస్తున్నదెవరో తెలంగాణ మట్టికి తెలుసునన్నారు. ఎవరెన్ని టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించినా.. గోల్మాల్ కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరన్నారు.
తెలంగాణ కన్నీళ్లను తుడిచి బీడు భూములపై గంగమ్మను ప్రవహింపజేస్తున్న కేసీఆర్‌ను తెలంగాణ గుండెల్లో దాచుకుంటుందన్నారు. తెలంగాణను నిస్తేజంగా మార్చిన కాంగ్రెస్ అసలు రంగు ప్రజలకు తెలుసునన్న కేటీఆర్.. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పన్నినా 30న బ్యాలెట్ బాక్సుల్లో బీఆర్ఎస్ విజయం పదిలమన్నారు. తెలంగాణను చీకట్లో ముంచిన కాంగ్రెస్‌ను ప్రజలు తిప్పికొడతారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎండిన భూములు, రాష్ట్రం నుంచి సంఖ్యల్లో వలసలు కొనసాగాయని.. బీఆర్ఎస్ పాలనలో పసిడి పంటల తెలంగాణ వర్ధిల్లుతోందని చెప్పారు. కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణ మొత్తం సంక్షోభమేనని.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ పునర్నిర్మించబడుతూ దేశానికే మోడల్‌గా మారిందని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వ్యవహారాన్ని కళ్లకు కట్టినట్లుగా పుస్తకాన్ని వెలువరించిన జూలూరి గౌరీశంకర్‌ను కేటీఆర్ అభినందించారు.