Ravula Sridhar Reddy | గత రెండు నెలల నుంచి కేటీఆర్‌ను టార్గెట్ చేసి, ఆరెస్టు చేస్తామని, జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రశ్నించే ప్రతి నేతపైనా కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని విమర్శించారు. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేషంలో రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్‌ను జైల్లో పెడితే ఇతరులు భయపడతారని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడటంలో వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందుకు నడిపించారని రావుల శ్రీధర్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ సంస్థను రాష్ట్రానికి తీసుకొచ్చి ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహిస్తే అక్రమాలు జరిగాయంటూ కేసులు పెట్టారని మండిపడ్డారు. అన్ని అంశాల్లో ప్రజల తరఫున కేటీఆర్‌ను ప్రశ్నించడాన్ని ప్రభుత్వం సహించలేకపోతుందని విమర్శించారు. అందుకే పస లేని కేసు పెట్టిందని అన్నారు. సాంకేతికంగా మీరు కేసులు పెట్టొచ్చు… కానీ విజ్ఞులైన ప్రజలు అన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఇది అవినీతి కేసు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. దీనిపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని నిలదీశారు. ప్రభుత్వం నుంచి నేరుగా ఆ సంస్థకు డబ్బులు చెల్లెస్తే అవినీతి ఎలా అవుతుందని అడిగారు.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ హైదరాబాద్‌కు ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలని రావుల శ్రీధర్ రెడ్డి ప్రజలను కోరారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన నగరాల్లో హైదరాబాద్ ఒకటి కావాలన్నదే కేటీఆర్ లక్ష్యమని తెలిపారు. కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఈ ఫార్ములా రేస్ రాష్ట్రానికి వచ్చిందని తెలిపారు. రూ.54 కోట్లతో ఈ రేసింగ్ నిర్వహించారని తెలిపారు. కేంద్రమంత్రులతో పాటు ఎంతోమంది ప్రముఖులు ఈ రేసింగ్ చూడటానికి వచ్చారని పేర్కొన్నారు. కానీ దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అవినీతి అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇందులో ప్రిసీజర్ లాప్స్ తప్ప ఒక్క పైసా అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. డబ్బులన్నీ సదరు కంపెనీకి ముట్టిన తర్వాత అవినీతికి ఆస్కారం ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు.
మంత్రిగా కేటీఆర్ పాలసీ డిసిషన్ మాత్రమే తీసుకున్నారని.. కానీ ఉద్దేశ పూర్వకంగా అవినీతిని ఆపాదిస్తున్నారని రావుల శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు . పైగా ఈ రేస్‌ను రేవంత్ రెడ్డి సర్కార్ రద్దు చేసిందని.. ఇది కూడా తెలివితక్కువతనమే అవుతుందని విమర్శించారు. కేటీఆర్‌ను జైల్లో పెట్టాలన్న కక్షపూరిత చర్యలు తప్ప ఇందులో మరొకటి లేదని అన్నారు. ఇక్కడ జరిగిందేమీ లేదు. అయినా కేటీఆర్‌పై కేసు పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వీటి ప్రాధాన్యత తెల్వదని అన్నారు. దేశ ప్రతిష్టను పెంచడానికి ఇలాంటి ఫార్ములాలు దోహదం చేస్తాయని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు పట్టుబడితే ప్రభుత్వం ఎందుకు పారిపోతుందని ప్రశ్నించారు.
కేటీఆర్‌ను జైల్లో పెడితే ఇతరులు భయపడతారని ప్రభుత్వం భావిస్తోందని రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. కేటీఆర్‌పై కేసుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలు అమలు చేయలేక అక్రమ కేసులతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడటంలో వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. చట్టపరంగా కేసులను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ ఎప్పుడూ సిద్ధమే అని తెలిపారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పారు.