Minister Puvvada Ajay | ఖమ్మం: తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం ఆయన 398 మందికి జీవో-58 ఇళ్ల పట్టాలు, 230 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసిడింగ్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రజాబలం బీఆర్ఎస్కే ఉందన్నారు. సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని అన్నారు. ప్రభుత్వ స్థలాల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదలకు గూడు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకువచ్చి ఆయా స్థలాలకు పట్టాలు అందిస్తున్నదని అన్నారు. సొంత స్థలం ఉండి ఆర్థిక స్తోమత లేక ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించేందుకే గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.
అనంతరం నగరంలోని 52వ డివిజన్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శంకుస్థాపన ఏశారు. ఖమ్మం ప్రధాన ఆసుపత్రిని సందర్శించి ప్రజలకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు.