MLC Kavita : రాష్ట్రంలో రాబోయేది గులాబీ జెండా శకమేనని, అందులో ఎలాంటి సందేహం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇవాళ నిజామాబాద్లో జరిగిన బహిరంగసభలో మాట్లాడిన ఆమె.. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానేనని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసాపై ప్రభుత్వం మాట్లాడటం లేదని, గురుకులాలను నడపడానికి కూడా ప్రభుత్వానికి చేతకావడం లేదని మండిపడ్డారు.
గురుకులాలను సక్రమంగా నిర్వహించలేక ఇప్పటికే 57 మంది పిల్లలను పొట్టనపెట్టుకున్నారని కవిత విమర్శించారు. ఇంకా ఎంత మందిని పొట్టనపెట్టుకుంటారని ప్రశ్నించారు. ఉద్యోగాల పేరిట సీఎం రేవంత్ రెడ్డి యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటివరకు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకే పరీక్షలు నిర్వహిస్తోందని ఎద్దేవా చేశారు.
అటో కార్మికులకు ఇబ్బందులు అన్నీఇన్నీ కాదని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి, ఉచిత సదుపాయం కల్పించిన ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల సంఖ్యను తగ్గించారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడని అన్నారు. రేవంత్ సర్కారు తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ మాతను ఏర్పాటు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మన పొట్టమీద కొట్టడమే కాదని, మన సంస్కృతిపై కూడా దాడి చేస్తున్నదని విమర్శించారు.
ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్భందాలకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదని, మళ్లొకసారి నిజామాబాద్ దమ్ము ఏమిటో సీఎం రేవంత్ రెడ్డికి రుచి చూపిద్దామని కవిత పిలుపునిచ్చారు.