(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా పిలిచే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో గులాబీదళం విజయదుందుభి మోగించనున్నదా? పోలింగ్ కంటే ముందే జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందా? పదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని.. రెండేండ్ల రేవంత్ పాలనలో జరుగుతున్న వినాశనాన్ని కండ్లారా చూసిన జూబ్లీహిల్స్ ఓటరు అధికార పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పనున్నాడా? జూబ్లీహిల్స్‌లో టీనేజీ కుర్రాడి నుంచి ఓల్డేజీ వరకూ, బస్తీలో బీడీలు చుట్టే ఆడబిడ్డ నుంచి కార్పొరేట్ ఆఫీసులో కొలువు చేస్తున్న మహిళా టెకీ వరకూ ఇలా ఏ ఒక్కరిని కదిపినా తమ మద్దతు బీఆర్ఎస్కే అని చెప్తున్నారు. మొన్నటికి మొన్న ‘కోడ్మో-కనెక్టింగ్ డెమోక్రసీ’ నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్దే విజయమని తేలింది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వేలోనూ జూబ్లీహిల్స్ గులాబీ ఖాతాలోకి వెళ్లనున్నట్టు స్పష్టమైంది. ఇప్పుడు తాజాగా ‘కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్’ నిర్వహించిన తాజా సర్వేలోనూ జూబ్లీహిల్స్‌లో కారు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నట్టు తేలింది. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 17 వరకూ దాదాపు నెలరోజులపాటు టెలిఫోన్ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో బీఆర్ఎస్కే మా మద్దతు అంటూ జూబ్లీహిల్స్‌లోని మెజారిటీ ప్రజలు తేల్చి చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదలు గులాబీ పార్టీకి కంచుకోటలా నిలుస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయాలు సాధించారు. దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ‘కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్’ అనే సంస్థ సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 17 వరకూ దాదాపు నెలరోజులపాటు టెలిఫోన్ సర్వే నిర్వహించింది. మరికొన్ని రోజుల్లో జరగనున్న ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి 50.6 శాతం మంది ప్రజల మద్దతు ఉన్నట్టు కేకే సంస్థ తాజా సర్వేలో వెల్లడించింది. అధికార కాంగ్రెస్ కంటే ఏకంగా 9.8 శాతం ఎక్కువ ఓట్లతో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయనుందని తెలిపింది. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయం ఆసక్తి రేపుతున్నది. ఈ క్రమంలోనే కేకే సంస్థ ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శాస్త్రీయంగా సర్వే చేపట్టింది. ఇందులో బీఆర్ఎస్ 50.6 శాతం ఓట్లతో ముందంజలో నిలువగా, 40.8 శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో, 8.4 శాతం మద్దతుతో బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది.
జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతాగోపీనాథ్ బరిలో నిలిచారు. ఇటీవల నిర్వహించిన ఓ సభలో చనిపోయిన భర్తను తలుచుకొని ఆమె భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. అయితే, కొందరు కాంగ్రెస్ మంత్రులు మానవత్వం మంటగలిసేలా ఈ ఘటనకు కూడా రాజకీయ రంగు పులిమారు. కృత్రిమ ఏడుపు, డ్రామా అంటూ కాంగ్రెస్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. దీనిపై మహిళా లోకం భగ్గుమన్నది. కాంగ్రెస్ తీరును తూర్పారబట్టింది. దీన్ని ధ్రువపరుస్తూ.. కేకే సంస్థ నిర్వహించిన సర్వేలో ఆడబిడ్డలు బీఆర్ఎస్కు పట్టంగట్టారు. సర్వేలో పాల్గొన్న మహిళామణుల్లో ఏకంగా 63.5 శాతం మంది బీఆర్ఎస్కే తమ ఓటు అని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్కు లభించిన మద్దతులో సగం కూడా కాంగ్రెస్‌కు లభించలేదు. దీన్నిబట్టి సునీత కన్నీటిపై దిగజారుడు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో మహిళలు గట్టి బుద్ధి చెప్పబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మహిళామణులే కాదు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వంటి సామాజికవర్గాల నుంచి హిందూ, ముస్లిం సహోదరుల వరకూ.. 18 ఏండ్లు నిండిన కొత్త ఓటరు నుంచి 60 ఏండ్లుపైబడిన ముదుసలి వరకు.. నిరక్షరాస్యుల నుంచి వివిధ రకాల వృత్తులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నవారు, విద్యావంతుల వరకు ఇలా సకల జనులు బీఆర్ఎస్కే ఈ సర్వేలో బ్రహ్మరథం పట్టారు. సర్వే గణాంకాల ప్రకారం.. బీఆర్ఎస్ పార్టీకి 46.7 శాతం మంది హిందువులు మద్దతు పలుకగా, ఏకంగా 73 శాతం మంది ముస్లింలు జైకొట్టారు. 46.8 శాతం మంది బీసీ బిడ్డలు కారు పార్టీని అక్కున చేర్చుకోగా.. 55.7 శాతం మంది ఎస్సీలు, 46.2 శాతం మంది ఎస్టీలు, 66.7 శాతం మంది మైనార్టీలు బీఆర్ఎస్కే తమ మద్దతు అని ప్రకటించారు. ఇక వయసుల వారీగా చూస్తే.. 18-25 ఏండ్ల మధ్య వయసున్న వారిలో 51.8 శాతం మంది బీఆర్ఎస్కు జైకొట్టారు. 26-35 ఏండ్ల మధ్య వయసున్న వారిలో 44.4 శాతం, 36-45 ఏండ్ల మధ్య వయసున్న వారిలో 57.4 శాతం, 45-60 ఏండ్ల మధ్య వయసున్న వారిలో 54.4 శాతం, 60 ఏండ్లు పైబడిన వారిలో ఏకంగా 60 శాతం మంది తమ ఓటు బీఆర్ఎస్ పార్టీకేనని తేల్చి చెప్పారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజానాడి ఎలా ఉన్నదో తెలుసుకోవడానికి గత నెలలో ‘కోడ్మో-కనెక్టింగ్ డెమోక్రసీ’ అనే సంస్థ టెలిఫోనిక్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 42.8 శాతం మంది బీఆర్ఎస్కే తమ ఓటు అని ప్రకటించినట్టు తేలింది. మళ్లీ కేసీఆరే సీఎం కావాలని 46 శాతం మంది ఓటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి అదే నెలలో కాంగ్రెస్ పార్టీ కూడా అంతర్గత సర్వేను నిర్వహించింది. ఆ సర్వేలోనూ బీఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్ కంటే 3 శాతం ఓట్లతో ముందంజలో ఉన్నట్టు తేలింది. గడిచిన కొద్దిరోజులుగా జూబ్లీహిల్స్ ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. దీంతో అదే తీరున ప్రజల్లో బీఆర్ఎస్కు మద్దతు క్రమంగా పెరుగుతున్నది. దీన్ని నిజం చేస్తూ గత నెలలో బీఆర్ఎస్కు 42.8 శాతం మేర ప్రజలు మద్దతు ప్రకటించగా, తాజా సర్వేలో ఇది 50.6 శాతానికి ఎగబాకడం విశేషం. తాజా పరిణామాలను చూస్తే, రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.