అమ్రాబాద్ (అచ్చంపేట), ఏప్రిల్ 7 : వరంగల్ జిల్లాలో ఈ నెల 27న నిర్వహించే గులాబీ పార్టీ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని తన నివాసంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలతో క్యాంపు కార్యాలయాలన్నీ కిటకిటలాడేవని గుర్తుచేశారు. రాబోయే ఎలక్షన్లలో ముఖ్యమంత్రి సొంత గ్రామం నుంచే గెలుపును ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా తాగు, సాగునీటి సమస్యలతో ప్రజలు, రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉమామహేశ్వర లిఫ్ట్‌ను తీసుకొస్తే ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. కార్యకర్తలు కేసులకు భయపడొద్దని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.