కేసీఆర్ ఇజ్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ. కేసీఆర్ ఇజ్ డెఫినెట్లీ తుడిచివేయలేని ఎమోషన్ తెలంగాణకు. కేసీఆర్‌కు తెలంగాణకు ఉన్న బంధం అది. (తెలంగాణకు) ఎక్కడా, ఎటువంటి దిక్కూ దివాణం లేనప్పుడు.. నా పదవులు, నా రాజకీయ భవిష్యత్తు అంతా పణంగా పెట్టి తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డనో తెలంగాణ ప్రజలకు తెలుసు. నా గుండెలో తెలంగాణ ఉంటది. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటడు. గెలుపోటములు పక్కకు పెడితే.. కేసీఆర్ ఇజ్ డెఫినెట్లీ ది ఎమోషన్ ఆఫ్ తెలంగాణ. వంద శాతం ఆ బాండేజ్ కేసీఆర్‌కు ఉంటది. కేసీఆర్‌ను వట్టిగనే గిల్లిపడేస్తం..తుడిచిపడేస్తం అని ఎవడైనా అనుకుంటే.. వాడు పిచ్చోడవుతడు తప్ప కేసీఆర్ గానీ, తెలంగాణ ప్రజలు గానీ పిచ్చోళ్లు కారు.
– కేసీఆర్

KCR | హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రాంతీయ శక్తుల ఐక్యత పెంచి, కచ్చితంగా ప్రత్యామ్నాయం రూపొందిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఏదో ఒక జాతీయ పార్టీ తమకు మద్దతు ఇవ్వక తప్పలేని పరిస్థితిని కల్పిస్తామని చెప్పారు. తెలంగాణకు, కేసీఆర్ మధ్య ఎమోషనల్ బాండింగ్ ఉంటుందని తెలిపారు. తన పదవులను, రాజకీయ భవిష్యత్తును ఫణంగా పెట్టి తెలంగాణ కోసం ఎలా కొట్లాడానో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు.
అందుకే తన గుండెల్లో తెలంగాణ ఉంటదని, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటడని తెలిపారు. తెలంగాణ భవన్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌ను యూటీ లేదా రెండో రాజధాని చేస్తే బాగుంటదని అంటున్నారు. తన ఊరికి కూడా దగ్గరవుతదని అంటున్నారు. మీరేమంటారు?
ఖర్గేలాంటి వ్యక్తి అలా మాట్లాడడం కన్నా వేరే దురదృష్టం ఉండదు. ఇన్ని రోజులు ఢిల్లీకి మోసిన వ్యక్తి ఇప్పుడు హైదరాబాద్ దగ్గరవుతదని మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజల గొంతు కోస్తానంటే ఎవరూ ఊరుకోరు. ఖర్గే లాంటి వ్యక్తే ఇలా అంటున్నారంటే కాంగ్రెస్, బీజేపీ ఎవరు వచ్చినా హైదరాబాద్‌ను దెబ్బతీయడం ఖాయం. అలాంటి పిచ్చివాళ్లకు ఇక్కడ స్థానం ఇవ్వొద్దు. హైదరాబాద్ మనది, అది మన సొంతం.
హైదరాబాద్‌లో పవర్ కట్స్‌కు సిటీలో బీఆర్ఎస్ అండర్ గ్రౌండ్ లైన్లు వేయకపోవడమే కారణమని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు?
కేసీఆర్: అసలు దేశంలో ఎన్ని సిటీల్లో అండర్‌గ్రౌండ్ లైన్లు ఉన్నాయి. అవసరమైన చోట కొద్ది దూరం వేస్తారు. రేవంత్‌రెడ్డి నోటికి మొక్కాలె. ఆయన ఏం చెప్తడో, అసలు ఆయనకు ఏమన్నా తెలుసా? తెలియదో నాకైతే అర్థం కావడం లేదు.
భాష విషయంలో సంయమనం పాటిద్దామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదన పెట్టారు. మీరేమంటారు?
దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది.
గతంలో మీరు ప్రాంతీయ పార్టీలతో కలిసి థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నించారు. ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ, యూపీకి ప్రత్యామ్నాయం రావాలంటే ఏయే పార్టీలు కలిసి వచ్చే అవకాశం ఉంది?
జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామనే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి ప్రయత్నించాం. మహారాష్ట్రలో పోటీ చేసినం. అక్కడ బీఆర్ఎస్లో చేరిన వారు నిన్న వచ్చి నన్ను కలిశారు. ‘సార్ మహారాష్ట్రంలో అక్టోబర్‌లో శాసనసభ ఎన్నికలు ఉన్నాయి. మీరు వచ్చి ఊరికే నిలబడండి సార్. మేమంతా మీ పేరు చెప్పుకొని గెలుస్తాం. మా దగ్గర కూడా మార్పు రావాలి. తెలంగాణలో మీ ప్రభుత్వంలో అమలు చేసిన కార్యక్రమాలు కావాలని మహారాష్ట్ర ప్రజలు కోరుతున్నరు. మిమ్మల్ని తీసుకురమ్మని కోరుతున్నరు’ అని తెలిపారు.
నేను తప్పకుండా నా జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తా. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందరితో చర్చించి ప్రాంతీయ శక్తుల ఐక్యతను పెంచే ప్రయత్నం చేస్తా. సారూప్యత ఉన్న నాయకులతో మాట్లాడుతున్నా. తప్పకుండా అందరం కలిసి ప్రత్యామ్నాయం రూపొందిస్తాం. ఏదో ఒక జాతీయ పార్టీ మాకు సపోర్ట్ చేయక తప్పని పరిస్థితిని సృష్టిస్తాం.
మీరేమో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 12-14, కాంగ్రెస్‌కు ఒక సీటు కూడా వస్తుందో, రాదోనని అంటున్నారు.
రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్కే ఒకటిరెండు స్థానాలు వస్తాయంటున్నారు?
సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన విషయాలు ఎన్ని నిజమయ్యాయో, ఎన్ని కాలేదో ప్రజలకు తెలుసు. ఆయన చెప్పినవాటిలో నిజాలెన్ని, అబద్ధాలెన్ని? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చెప్పినవి ఎన్ని.. చేసినవి ఎన్ని అనేది ప్రజల అనుభవంలోకి వచ్చేసింది. అలాంటి వ్యక్తి మాటలపై నేను కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో మీతో కలిసి పనిచేసిన ఎంఐఎం ఇప్పుడు ఎందుకు దూరమైంది?
ఎంఐఎం మా నుంచి దూరమైందని ఎవరు చెప్పారు? ఎలా చెప్తారు?
మీ రోడ్ షోలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. మిమ్మల్ని ప్రజలు ఎలా ఆదరించారు?
కేసీఆర్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ. తుడిచేయలేని, తీసేయలేని ఎమోషన్ కదా తెలంగాణకు కేసీఆర్. కేసీఆర్‌కు తెలంగాణకు ఉన్నటువంటి బంధం అది. పదవులను, నా రాజకీయ భవిష్యత్తును ఫణంగా పెట్టి తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డానో తెలంగాణ ప్రజలకు తెలుసు. నా గుండెల్లో తెలంగాణ ఉంటది. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటడు. గెలుపోటములు పక్కనపెడితే కేసీఆర్ ఈజ్ డెఫినెట్లీ ఎమోషన్ ఆఫ్ తెలంగాణ. 100 శాతం ఆ బంధం కేసీఆర్‌కు ఉంటది. అలాంటి కేసీఆర్‌ను గెల్లిపడేస్తాం, తుడిసిపడేస్తాం అని ఎవరైనా అనుకుంటే వాడు పిచ్చోడు అవుతడు తప్పితే కేసీఆర్ గానీ, తెలంగాణ ప్రజలు గానీ కారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత మీరు పొత్తు కోసం వెళ్తే మోదీ రిజెక్ట్ చేశారట కదా?
నేను ముందే చెప్పిన కదా మోదీ గోబెల్స్ అని. అయనకు ఎలా అవకాశం ఉంటే, ఎలా అనుకూలం ఉంటే అలా మాట్లాడుతారు. ఈ టంగ్ ట్విస్టింగ్ ఆయనకు వచ్చినంతగా మరొకరికి రాదు.
మీరేమో అభివృద్ధి చేశామంటారు? వారేమో వందేళ్ల విధ్వంసం అంటున్నారు?
వారి వాదన తప్పని ఇప్పటి వరకు నేను చెప్పిన లెక్కలే స్పష్టం చేస్తున్నయ్. అవన్నీ కాగ్ ఇచ్చిన వివరాలే. దీన్ని విధ్వంసం అంటారా? ఒకవేళ ఈ అభివృద్ధిని విధ్వంసం అంటే వారంత మూర్ఖులు మరొకరు ఉండరు.
ఉద్యమంలో కలుపుకొని వెళ్లిన ఉద్యమకారులు, మేధావులను అధికారంలో ఉండగా దూరం పెట్టారని కాంగ్రెస్ చెప్తున్నది.
షెడ్డుకు పోయిన కారు తిరిగి రాదని ప్రచారం చేస్తున్నది కదా?
కారు షెడ్డులో ఉంది కదా. అది తిరిగి ఎంత బలంగా వస్తదో ఆ ధాటికి రేవంత్‌రెడ్డి ఎక్కడికి కొట్టుకుపోతరో మీరు, నేను ఇద్దరం చూద్దాం.
బీజేపీ కాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ మాత్రమేనని రేవంత్ తొలిసారి అంగీకరించారు కదా?
ఇప్పటికైనా రేవంత్‌రెడ్డికి జ్ఞానోదయం అయితే సంతోషం. భవిష్యత్తులో ఇంకింత జ్ఞానం తెచ్చుకుంటే మంచిది.
ముస్లింల రిజర్వేషన్లను కాంగ్రెస్ తొలగిస్తదని బీజేపీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను బీజేపీ తొలగిస్తదని కాంగ్రెస్ ఆరోపించుకుంటున్నాయి. వీటిపై మీరేమంటారు?
బీజేపీ మతవిద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకుంటది. ఈ రిజర్వేషన్ల గోల వారు సృష్టిస్తున్నదే.ఎస్సీలకు 15శాతం రిజర్వేషన్ ఉంది. వారి జనాభా 19 శాతానికి పెరిగింది. వాళ్లలో దారిద్య్రం పోలేదనే దళితబంధు తీసుకొచ్చినం. కాబట్టి ఎస్సీల రిజర్వేషన్ 19 శాతానికి పెంచాల్సిన అవసరం ఉంది. అర్హులకు కులమతాలకు అతీతంగా రిజర్వేష్లు ఉండాల్సిందే, వాటిని కొనసాగించాల్సిందే. ముస్లింల రిజర్వేషన్లు తీస్తామనడం వందశాతం తప్పు. వాటిని అలాగే ఉంచి, ఇంకేమైనా ఇవ్వాలి తప్పితే ద్వేషం తగదు.
బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్గా మారబోతుందని అంటున్నారు. మీరేమంటారు?
ఇది జరగదు. బీఆర్ఎస్ బీఆర్ఎస్గానే ఉంటది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
ఏ విషయాన్నైనా సరళంగా సూటిగా మాట్లాడే కేసీఆర్ లేని లోటు అసెంబ్లీలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ లోటును ఎప్పుడు భర్తీ చేస్తారు?
నెక్ట్స్ సెషన్ నుంచి చూస్తారు కదా కేసీఆర్ ప్రళయ గర్జన.
ఈ ఎన్నికల తర్వాత కేంద్రంలో బీఆర్ఎస్ కీలకమవుతుందని చెప్తున్నరు. మీరేమైనా ప్రధాని రేసులో ఉంటారా?
అవకాశం వస్తే 100శాతం రేసులో ఉంటా. ఎందుకు ఉండను? నేను అంత అమాయకుడినా. అవకాశం రావాలేగానీ ఎందుకు ఉండను. ‘ఐ విల్ బి ఇన్ ద రేస్’. కేశవరావు పార్టీ నుంచి వెళ్లిపోయారు కాబట్టి కేఆర్ సురేశ్‌రెడ్డి మా పార్లమెంటరీ పార్టీ లీడర్ కాబోతున్నరు. చైర్మన్‌కు లెటర్ ఇవ్వబోతున్నాను. ఆయన బీఆర్ఎస్ తరుఫున ఢిల్లీలో కీలక నేత కాబోతున్నరు.
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ అన్ని అసెంబ్లీ సీట్లను గెలుచుకున్నది. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో మూడో స్థానంలో ఉంటుందని ఎలా చెప్తున్నారు?
కచ్చితంగా చెప్పొచ్చు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మేం ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచిన పార్లమెంట్ స్థానాలను కోల్పోయినం. నిజామాబాద్ సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీ సీట్లను గెలిచాం. కానీ అక్కడ మేం ఓడిపోయాం. అలాగే ఆరు సీట్లు గెలిచిన చోట కూడా ఓడిపోయం. ఇవన్నీ తారుమారవుతాయి. ప్రజల అభిప్రాయం కచ్చితంగా మారుతుంది. ఇక మాదిగ సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వలేదని వాళ్లంతా చాలా ఆగ్రహంగా ఉన్నారు. పెద్దపల్లిలో వాళ్లే పంతం పట్టి కాంగ్రెస్‌ను ఓడించి చూపిస్తామని పట్టుదలతో ఉన్నరు. ఆ ఫలితాన్ని కాంగ్రెస్ పార్టీ అనుభవించక తప్పదు.

జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేస్తామని కాంగ్రెస్ చెప్తున్నది. మీ అభిప్రాయం?
ఈ ప్రభుత్వానికి ఏం పనిలేదు. అసలు చేయాల్సిన పనులను పక్కకు పెట్టి పనికిమాలిన పనులను ముంగట వేసుకుంటున్నది. ఒక్కొక్క జిల్లాను నేను ఊరికే చేయలేదు. మంచి చెడులు, పూర్వాపరాలు ఆలోచించి, అభివృద్ధి ఆశించి చేసినం. ఛత్తీస్‌గఢ్‌లో ఒక్క బస్తర్ జిల్లాను విభజించి అనేక జిల్లాలను ఏర్పాటు చేశారు. అందుకే నేను ఛత్తీస్గడ్ సీఎస్‌తో మాట్లాడి ఏ విధంగా చేశారని వివరాలు తెలుసుకొని ములుగు, భూపాలపల్లి ఇలా ఇంకా కొన్ని జిల్లాలు ఏర్పాటు చేశా. అక్కడ అభివృద్ధి కారిడార్లుగా మారాలని, అక్కడికి అడ్మినిస్ట్రేషన్ చేరాలని, ప్రత్యేకంగా కలెక్టర్, ఎస్పీ ఉండాలని, అలా ఉంటేనే అభివృద్ధి బాగా జరుగుతుందని ఆలోచించి జిల్లాలు ఏర్పాటు చేశాం. కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించిన సిరిసిల్ల, జగిత్యాల కావొచ్చు. భూపాలపల్లి, ములుగు కావొచ్చు. గద్వాల వంటివి కావొచ్చు.. ఇలా చాలా ఆలోచించి తెలంగాణ ప్రగతిని ఆశించి చేసిన జిల్లాలివి. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. కొత్త జిల్లాల ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై చాలా కోపంగా ఉన్నారు. ఏయే జిల్లాలనైతే కాంగ్రెస్ తీసేయాలని చెప్తున్నదో ఆ జిల్లాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దెబ్బ పడబోతున్నది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మీ ఆదేశాలనే పాటించామని, సొంత నిర్ణయాలు తీసుకోలేదని రాధాకిషన్‌రావు స్టేట్మెంట్ ఇచ్చారు.
దీనిపై మీ స్పందన?
రాధాకిషన్‌రావు ఎవరు? రాష్ట్రంలో వంద మంది డీసీపీలు ఉంటే ఆయనొక్కరిని పట్టుకొని నన్ను ప్రశ్న అడిగితే ఎలా? అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ ఏంటి? అందరికీ అదో పిచ్చి పట్టుకున్నది. ముఖ్యమంత్రికి.. ఫోన్ ట్యాపింగ్‌కు ఏమైనా సంబంధం ఉంటుందా? ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్టులు తీసుకుంటాడు. ఆ రిపోర్ట్స్ ఎట్లా తీసుకొచ్చారనేది సీఎంకు ఏ విధంగా తెలుస్తది. వాళ్లు ట్యాపింగ్ చేశారో, లేదో, డబ్బులు ఇచ్చారో, లేదా రహస్య వ్యవస్థ పెట్టుకున్నారో ఏం చేశారో మాకెలా తెలుస్తుంది. అదో ఇష్యూనా? వాట్ ఈజ్ దట్ నాన్సెన్స్. ఫినాయిల్ పెట్టి నోరు కడుక్కునే పరిస్థితి తీసుకొస్తున్నరు. ఈ ప్రపంచంలో గూఢచారి వ్యవస్థ లేని ప్రభుత్వమే ఉండదు.
సీఎంకు, మంత్రులెవరికీ కూడా ఇందులో సంబంధం ఉండదు. ఇంటెలిజెన్స్ వాళ్లు ఇచ్చే రిపోర్ట్‌కు మాత్రమే సంబంధం ఉంటుంది. ఇక పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకున్నా టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం రాష్ట్ర హోం సెక్రటరీ అనుమతి తీసుకొని చేస్తారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా తీసుకున్న సమాచారాన్ని నిర్ణీత గడువు తర్వాత డిమాలిష్(తొలగింపు) చేయొచ్చని కూడా చట్టంలోనే ఉంది. ఇవన్నీ తెలియకుండా ఇదేదో భయంకరమైన అంశం అయినట్టు, మేమేదో చేసినట్టు, ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లు చేస్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా ట్రాష్ ఉత్తదే.
ఉద్యమ సమయంలో మీకు, మీ కుటుంబ సభ్యులు పారగాన్ చెప్పులతో తిరిగారని, డీజిల్ పోసుకోవడానికి కూడా డబ్బులు లేని వారు లక్షల కోట్లు ఎలా సంపాదించారని, ఆ డబ్బులు స్వాధీనం చేసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పుతున్నారు?
మాది పారగాన్ చెప్పులు లేని కుటుంబమా? మా డబ్బులు స్వాధీనం చేసుకోమనండి. చాలా సంతోషం. పారగాన్ చెప్పుల లేకుండా నేను ఉన్నానో, రేవంత్ రెడ్డి ఉన్నాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎవరు భూకబ్జాదారో, ఎవరు బ్లాక్ మెయిలరో, ఎవరు ఓటుకు నోటుకు కేసులో పట్టుబడ్డారో, ఎవరు దొంగ దందాలు చేశారో అందరికీ తెలుసు.
టెస్లాతో సహా 13 పరిశ్రమలు గుజరాత్‌కు తీసుకెవెళ్లడానికి మోదీ ప్రయత్నాలు చేస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డి చెపుతున్నారు?
ఇలాంటి చాతకాని ముఖ్యమంత్రి ఉంటే పరిశ్రమలు గుజరాత్‌కు పోతయి, తమిళనాడు, కేరళకు పోతయి. పరిశ్రమలు పోతుంటే ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నడు. మోదీ అడ్డపడినా కూడా కొన్ని కంపెనీలను ఇక్కడికి తీసుకొచ్చాం. ఫేస్బుక్ లాంటి సంస్థను అహ్మదాబాద్‌కు తీసుకుపోవాలని మోదీ చాలా ప్రయత్నాలు ఎత్తులు వేశారు. మేం అంతకుమించిన ఎత్తులువేసి ఇక్కడికి తీసుకొచ్చాం.
అసెంబ్లీలో చెల్లని రూపాయి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా చెల్లుతుందని మెదక్ సభలో మీరు అన్నారు. బీఆర్ఎస్ నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొప్పుల ఈశ్వర్, బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వారు పోటీ చేస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు?
నేను మాట్లాడింది మెదక్‌కు సంబంధించి. అది చెల్లుతుందా? లేదా? అనేది అక్కడి ప్రజలు నిర్ణయిస్తారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మా పార్టీలో ఓడిపోలేదు. కొప్పుల ఈశ్వర్ మా పార్టీ నుంచి ఓడిపోయారు.
రైతుబంధు విషయంలో ఎక్కువ ఎకరాలు ఉన్న వారికి ఇవ్వాలా? వద్దా ? అనేది చర్చిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం కూడా ఐదు ఎకరాల లోపు వారికే ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దీనిపై మీ అభిప్రాయం?
రైతుబంధు సృష్టికర్తను నేను. తెలంగాణ ఏర్పడిన నాడు రైతులు చెట్టుకొకరు, గుట్టకొకరు అయ్యారు. రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. కనీసం 10-15 ఏండ్లు రైతులకు పెట్టుబడి, ఉచిత విద్యుత్తు, నీళ్లు తెచ్చి ఇస్తే రైతుకు లాభం జరుగుద్దని రైతుబంధు పెట్టాను. వ్యవసాయశాఖ నుంచి జీఎస్డీపీకి 18.36 శాతం వస్తుంది. నేను అనుకున్న కల నెరవేరింది. ఇంకో ఐదారు ఏండ్లు కొనసాగించి సీలింగ్ గురించి ఆలోచిద్దామని అనుకున్నాను. రైతుల అప్పులు తీరిపోయి సొంత పెట్టుబడి పెట్టుకునే స్థాయికి వస్తే అప్పుడు పేద రైతులకు పెడదాం, ధనిక రైతులకు తీసేద్దామనుకున్నాం. ఇంత తొందరగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే దిక్కుమాలిన చర్యలు చేయలేదు. రైతుల ఆగ్రహాన్ని వాళ్లు చూడబోతున్నారు. 15-20 ఎకరాలు దాటిన వారికి లిమిట్ పెడితే అర్థం ఉంటుది.
ముస్లింలకు మీరు ఏమని పిలుపునిస్తరు?
రాష్ట్రంలో ముస్లింలు భ్రమలో పడి కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అనవసరంగా బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ వాళ్లు మూడో స్థానంలో ఉన్నారు. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ. మైనార్టీ గురుకులాలు పెట్టిన పార్టీ. మైనార్టీలకు 12 వేల కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ ఇది. బీఆర్ఎస్ను ఆదరించండి. ముస్లిం మైనార్టీ సంక్షేమాన్ని కాపాడుతది. రిజర్వేషన్లు కాపాడుతది. మీ హక్కుల కోసం పోరాడతది. బీఆర్ఎస్కే ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ ముస్లింలందర్నీ కోరుతున్నా.
మైనార్టీ గురుకులాల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)లలో స్టాఫ్ , విద్యార్థులు లేరని మూసివేస్తున్నారు?
ముస్లింలకు బీఆర్ఎస్ ఇచ్చినన్ని స్కాలర్షిప్లు ఎవరూ ఇవ్వలేదు. ఐఏఎస్ కోచింగ్, విదేశీ స్కాలర్షిప్లు పెట్టాం. ఇండియాలో ఎక్కడా ఇలాంటివి లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం తియ్యగా మాట్లాడతది తప్ప మంచి పనిచెయ్యదు. మైనార్టీల అభివృద్ధిపై దానికి ఇంట్రెస్ట్ లేదు. బీఆర్ఎస్సే మైనార్టీలకు శ్రీరామ రక్ష. టెమ్రిస్ను యథావిధిగా కొనసాగిస్తాం.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత 20-25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారని మంత్రులే చెప్తున్నారు?
సాయంత్రం వరకు నీ దొడ్లో ఎవరుంటారో చూసుకో.. అని రేవంత్‌రెడ్డి మాట్లాడిండు. ఆయన మాట్లాడిన తర్వాత కూడా నా దొడ్డి నిండుగానే ఉంది. రేవంత్‌రెడ్డే బీజేపీలోకి జంప్ కొడతారని సొంతపార్టీ వారే అనుమానం వ్యక్తంచేస్తున్నరు. ఓటుకు నోటు భయకరమైన కేసు. రేవంత్‌రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన కేసు. దీని నుంచి ఆయన తప్పించుకోలేరు. ఇదేమైనా కిందిమీదైతే కేసులు తప్పించుకునేందుకు ఆయనే జంప్ అయితడనే ప్రచారం ఉంది. మా పార్టీలోని కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం నేతలు సంప్రదిస్తున్నరు. మేం 26-33 మంది ఎమ్మెల్యేలు ఉన్నమని, మేం మీతో కలుస్తమని, కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని చెప్తున్నరు. పైన తథాస్తు దేవతలుంటారు.మరి అటునుంచి ఇటు పోతరో, ఇటు నుంచి అటు పోతరో చూద్దాం.
అప్పట్లో మిమ్మల్ని, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారందరూ అధికారం రాగానే మీ చూట్టూ చేరారు. అధికారం పోగానే వెళ్లిపోయారు. దీనిపై మీ స్పందన?
నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక దేశంలో చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. సన్‌ఫ్లవర్ గ్యాంగ్‌లు ఎక్కువయ్యాయి. ఇవన్నీ పవర్ ఫ్లవర్స్. పవర్ ఎక్కడుంటే అటు తిరుగుతరు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారంతా కాంగ్రెస్‌ను గెలిపిస్తారా? గెలిపించడానికి వెళుతున్నారా? వారి స్వార్థం కోసం వెళ్తున్నరు. పనుల కోసం, పైరవీల కోసం, స్వలాభం కోసం వెళ్తున్నరు. బీఆర్ఎస్ పార్టీ ఓ మహా సముద్రం. 60 లక్షల సభ్యత్వం గల పార్టీ. ఎవరైనా దేన్నైనా ఎలిమినేట్ చేస్తాం(తొలగిస్తాం) అనుకుంటే అది తప్పు. మేం 10 ఏండ్లు అధికారంలో ఉన్నాం. మరి కాంగ్రెస్ ఎలిమినేట్ అయిందా?. చంద్రబాబు కూడా 2004-2014 వరకు అధికారంలో లేరు. మరి టీడీపీ పోయిందా? లక్ష మంది రేవంత్‌రెడ్డిలు వచ్చినా? అలాంటి వారు కోటిమంది వచ్చినా ఏం ఫరక్ ఉండదు.
గతంలో రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామన్నారు కదా?
రైతుకు సహకారం అందించేందుకు పెట్టుబడి సాయం చేయాలని ప్రయత్నం చేశాం. ఆ సమయంలో ఉచితంగా యూరియా బస్తాలు ఇద్దామని కొందరు సలహా చెప్పారు. ఆశోక్ గులాటీ దేశంలో ప్రముఖ ఆగ్రో ఎకనామిస్ట్. దీనిపై ఆయన సలహా అడిగాను. యూరియా బస్తాలు రైతుకు ఇస్తే వాటిలో మిగిలిపోయే వాటిని అమ్ముకుంటే రైతుకు ఆపఖ్యాతి వస్తుందని వద్దని చెప్పారు. మీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి డబ్బులే రైతులకు ఇవ్వమని సలహా ఇచ్చారు. అప్పుడే ఎరువుల బస్తాల ఆలోచన విరమించుకొని రైతుబంధు పేరుతో డబ్బులు ఇస్తున్నాం. దీని ద్వారానే మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించి పంజాబ్‌ను తలదన్నాం.
కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని అంటున్నారు. సాధ్యమేనా?
నేను కూడా గతంలో రైతు రుణమాఫీ ప్రకటించిన. ఒకే విడతలో చేద్దామని నేను చేయని ప్రయత్నం లేదు. ఎక్కని కొండ లేదు, మొక్కని దేవుడు లేడు. ఒకే విడతలో రుణమాఫీ అసాధ్యం(ఇట్స్ ఇంపాజిబుల్). అందుకే కాంగ్రెస్ వాళ్లు అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేశారని ప్రజలకు చెప్పిన. ప్రజలు కూడా దీన్ని నమ్ముతున్నారు. వానకాలంలో రైతుభరోసా ఇవ్వాలి, నాలుగు డీఏలు ఇవ్వాలి. ఉద్యోగస్థులు 51శాతం ఫిట్మెంట్ అడుగుతున్నారు. వీటికి తోడు 40వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేయాలి. ఇవన్నీ ఎలా చేస్తరు? అది జరిగే పనికాదు. ఆ కార్పొరేషన్ కూడా ఉత్తదే. ప్రభుత్వంలో ప్రతి రోజూ రూపాయి రాక, పోక ఉంటుందే తప్ప సూట్‌కేసుల్లో డబ్బులు ఉండవు. రేవంత్‌ది భ్రమ.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చింది. అదే కేసులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రాలేదు?
ఢిల్లీ లిక్కర్ స్కాం అనేది మోదీ సృష్టించిన ఒక రాజకీయ కుంభకోణం. అది ఓ రివర్స్ పొలిటికల్ స్కాం. అందులో ఏం లేదు. ఇయ్యాల్టి వరకు ఒక రూపాయి రికవరీ చేయలేదు. కేజ్రీవాల్, నేను ఇద్దరం మోదీకి కంట్లో నలుసులా ఉన్నాం. 104 మంది ఎమ్మెల్యేలు మాకు ఉండి, ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేల మద్దతుతో 111 మందితో మా ప్రభుత్వం ఉన్నా మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆయన ప్రతినిధులను పంపించారు. బేరాలు చేశారు. వాళ్లను పట్టి నిర్బంధించి జైల్లో వేశాను. మూలసూత్రధారి బీఎల్ సంతోష్, ప్రధానమంత్రికి రైట్ హ్యాండ్.
ఆయనను పట్టుకరమ్మని ఢిల్లీ బీజేపీ సెంట్రల్ ఆఫీసుకు మన పోలీసులను పంపించాను. ఆయన తప్పించుకున్నాడు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని నన్ను, కేజ్రీవాల్‌ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని అటు కేజ్రీవాల్‌ను, నా కూతురు కవితను అరెస్ట్ చేశారు. వాళ్లు కడిగిన ముత్యాల్లా బయటికి వస్తారు. కవిత బతుకమ్మ ఉద్యమం చేసింది. తెలంగాణ ఉద్యమానికి ఎంతో కంట్రిబ్యూట్ చేసింది. తన జీవితాన్ని వదులుకొని ఆమెరికా నుంచి వచ్చి ఉద్యమానికి పనిచేసిన బిడ్డ కవిత. కవిత స్టాండర్డ్, ఆమె ఎట్ల మాట్లాడుతదో, ప్రవర్తన ఏందో మీ అందరికీ తెలుసు. నా కూతురు అనే కక్షతోనే నిర్దోషిని పట్టుకుపోయి మోదీ అరెస్ట్ చేశాడు. భయపడం, రాజకీయ కుటుంబం కాబట్టి అన్ని ఎదుర్కొంటాం. మాకు జైళ్లు కొత్త కాదు.