సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 20: కాంగ్రెస్ కండ్లు బైర్లు కమ్మేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించబోతున్నట్టు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. ఆదివారం ఆయన మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు చీమలదండులా తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు. ఉద్యమనేత కేసీఆర్ గాంధేయ పద్ధతిలో పోరాడి రాష్ర్టాన్ని సాధించారని, ముఖ్యమంత్రిగా పదేండ్లపాటు రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపించి దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నదని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు.