స్టేషన్ ఘనపూర్ : జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలో బీఆర్ఎస్(BRS) శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. గత రెండు రోజుల క్రితం స్టేషన్ ఘనపూర్‌లో జరిగిన నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యుల సన్మానసభ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam) చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం మండలంలోని తాటికొండ, మీదికొండ, విశ్వనాధపురం గ్రామాలలో కడియం దిష్టిబొమ్మలను బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సీపీ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టు చేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి తన బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం నేడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని స్పీకర్‌కు ఇచ్చిన వాంగ్మూలంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊసరవెల్లిలా పార్టీలు మార్చే కడియం శ్రీహరికి రానున్న ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని వారు పిలుపునిచ్చారు.