సిద్దిపేట, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులను కొన్నా.. తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలను కొనలేదు. కష్టకాలంలో బీఆర్ఎస్కు ద్రోహం చేసినోళ్లు కన్నతల్లికి ద్రోహం చేసినట్టే. పోయినవాళ్లు కాళ్లు మొకినా మళ్లీ పార్టీలో చేర్చుకోం. మధ్యలో వచ్చినవాళ్లు, పవర్ బ్రోకర్లు మాత్రమే పోతున్నారు. కార్యకర్తలు వెళ్లటం లేదు. ఇది శిశిరకాలం. పనికిరాని ఆకులు పోతాయి. కొత్త చిగురు వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది’ అని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట, దుబ్బాకలో పార్టీ సన్నాహక సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. సిద్దిపేట, దుబ్బాకకు సాగునీరు, తాగునీరు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీయేనని తెలిపారు. ఈ ప్రాంతానికి కాంగ్రెస్, బీజేపీలు ఏం చేయలేదని చెప్పారు. అధికారం కోసం అనేక హమీలు ఇచ్చిన కాంగ్రెస్‌ను ఎక్కడికక్కడ నిలదీయాలని, ఆ పార్టీ అబద్ధాలు, మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మళ్లీ ఒక్క సారి ప్రజలు మోసపోకూడదని అన్నారు. ఆరు గ్యారెంటీలు అమలుచేసే వరకు కాంగ్రెస్ సర్కారుకు అసెంబ్లీలో చుకలు చూపిస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇంకా ప్రతిపక్ష నాయకుడిలాగే మాట్లాడుతున్నారని విమర్శించారు. మావవబాంబులా కాదు, మానవీయంగా ప్రవర్తించాలని సీఎంకు హితవు పలికారు.
కేసీఆర్ లేని తెలంగాణను ఊహించలేం
‘కేసీఆర్ లేని తెలంగాణను ఊహించలేం. ప్రస్తుతం పరీక్షాకాలం. సిద్దిపేట కార్యకర్తలకు ఇది పరీక్ష. నా ఎన్నిక కోసం కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం కూడా అంతే కష్టపడాలి. నాకు వచ్చినంత మెజారిటీతో ఆయనను గెలిపించాలి. వెంకట్రామిరెడ్డి సిద్దిపేట జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారు. దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. పేదలకు సాయం చేసే పెద్ద మనసు ఉన్నది. విద్యావంతుడు, కలెక్టర్‌గా పనిచేసిన ఆయనను గెలిపిస్తే ఢిల్లీలో మన గళం బలంగా వినిపిస్తారు. దుబ్బాక, మెదక్‌కు నిధులు తెప్పిస్తారు’ అని హరీశ్ చెప్పారు.
కొడంగల్‌కు ఏమైనా తీసుకపో, కానీ..
సిద్దిపేటలో అభివృద్ధిని సీఎం రేవంత్‌రెడ్డి అడ్డుకుంటున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. వెటర్నరీ కాలేజీని కొండంగల్కి తరలించారని, పనులు జరుగుతున్న దాన్ని ఎలా తరలించుకపోతారని ప్రశ్నించారు. కొడంగల్‌కు ఏమైనా తీసుకపో. కానీ సిద్దిపేటకు వచ్చినవి తీసుకపోతే చూస్తూ ఊరుకోం’ అని హెచ్చరించారు. సిద్దిపేట మీద రేవంత్‌కు ఇంత పగ ఎందుకు? సిద్దిపేటపై బీజేపీకి ఎందుకింత ద్వేషం? రఘునందన్ దుబ్బాకకు చేసిందేమిటి? అని ప్రశ్నించారు. ‘సిద్దిపేట అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కండ్లలో నిప్పులు పోసుకుంటున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే బీజేపీ కేసులు పెడుతున్నదని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం కూతురు మీద కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వాళ్లు దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ సోషల్ మీడియాను నమ్మవద్దని ప్రజలు, పార్టీ క్యాడర్‌కు సూచించారు. సమావేశాల్లో పార్టీ మెదక్ లోక్‌సభ ఎంపీ అభ్యర్థి పీ వెంకట్రామిరెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.