ఖైరతాబాద్, ఏప్రిల్ 1: టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్‌లోని అన్ని పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని బీఆర్ఎస్ నేత రాకేశ్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణ, వాల్యుయేషన్‌లో జరిగిన తప్పిదాలను రాష్ట్ర ప్రభుత్వం సరిదిద్దుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రూప్-1లో తెలుగు మీడియం అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందని, మొత్తంలో 40 శాతం మంది ఉంటే టాప్-500లో కనీసం ఒక్క అభ్యర్థి కూడా లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. దీంతో టీజీపీఎస్సీ ద్వారా తెలుగు మీడియంను చిన్నచూపు చూసిన చరిత్ర రేవంత్‌రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. యూపీఎస్సీ ప్రమాణాలతో టీజీపీఎస్సీ పరీక్షలను నిర్వహిస్తామని చైర్మన్ చెప్పారని, వాటిని ఎక్కడా పాటించలేదని ధ్వజమెత్తారు. 45 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తే, కేవలం 10, 15 కేంద్రాల్లోని అభ్యర్థులే టాపర్లుగా నిలిచారని, మిగతా కేంద్రాల్లో ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
18వ కేంద్రంలో 10 శాతం, సెంటర్-4లో 0.2 శాతం ఉత్తీర్ణత ఉన్నదని, ఈ వ్యత్యాసం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. సెంటర్‌కో రీతిలో పేపర్ల మూల్యాంకనం జరిగిందని విమర్శించారు. ఏపీపీఎస్సీలో 6వేల పేపర్లు దిద్దడానికి 40 రోజులు తీసుకున్నారని, ఇప్పుడు 20 వేల పేపర్లను ఇంత తక్కువ సమయంలో ఎలా దిద్దారని ప్రశ్నించారు. ఒక్క పేపరు దిద్దడానికి కనీసం ఐదు నిమిషాలు కూడా తీసుకోలేదని తెలుస్తున్నదని పేర్కొన్నారు. మొత్తం గ్రూప్ పరీక్షల నిర్వహణే తప్పుల తడకగా జరిగినట్టు స్పష్టమవుతుందని ధ్వజమెత్తారు. అశోక్‌నగర్‌కు సీఎం రేవంత్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి చేసిన అన్యాయాన్ని అశోక్‌నగర్‌లోని ప్రతి హాస్టల్, ప్రతి కోచింగ్ సెంటర్ విద్యార్థి గుర్తు పెట్టుకుంటారని, తగిన సమయంలో గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. అన్యాయం జరిగిన అభ్యర్థుల పక్షాన బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ విఠల్, తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్, ఉద్యమ నేతలు జనార్ధన్, మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు.