Vishnuvardhan Reddy | హైదరాబాద్ : రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ సీనియర్ నేత పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ వద్దన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ ముద్దు అంటున్నారని హర్షవర్ధన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గం గతంలో చెప్పినట్టు ఎల్ఆర్ఎస్ వంద శాతం ఉచితంగా, తెలంగాణ ప్రజలపై ఎటువంటి భారం పడకుండా, ఎట్లాంటి ఫీజులు వసూలు చేయకుండా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో కొత్త పెట్టుబడులు దేవుడెరుగు ఉన్న పెట్టుబడులు తరలిపోతున్నాయని తెలిపారు. కేసీఆర్ హాయాంలో పెట్టుబడులు వస్తే.. రేవంత్ పాలనలో పెట్టుబడులు తరలిపోతున్నాయి. కక్షపూరిత చర్యలు మానుకుని సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టాలి అని సూచించారు.
గర్వంగా చెప్తున్నాం.. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా ఉంది. కేసీఆర్ పాలనలో 9 ఏండ్లలో రూ. 4 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించారు. కాంగ్రెస్ పాలనలో మల్టీ నేషనల్ కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. తెలంగాణలో అవినీతి, దోపిడీ, విధ్వంస పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు.
ప్రీమియర్ ఎనర్జీస్, అమరరాజ లాంటి కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. కాంగ్రెస్ పాలనలో ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారు. హైడ్రా వలన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుదేలైంది. గతంలో ఎల్ఆర్ఎస్ వద్దన్న కాంగ్రెస్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తోంది. రెవెన్యూ కోసం గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో 400 ఎకరాలు అమ్మకానికి పెట్టారని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.