దక్షిణాది రాష్ర్టాలకు రావాల్సిన నిధులను ఫైనాన్స్ కమిషన్ దారి మళ్లించడం సరికాదు. కేంద్రానికి దక్షిణాది రాష్ర్టాలు అధిక మొత్తంలో పన్నుల రూపంలో చెల్లిస్తున్నయ్. అయినా దక్షిణాది రాష్ర్టాలకు కేంద్రం తక్కువ నిధులు విడుదల చేయడం దారుణం.
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : కేంద్ర బడ్జెట్లో పసుపు బోర్డుకు పైసా కేటాయించకపోవడం దారుణమని రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం రాజ్యసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అం టూ ప్రారంభించడం అభినందనీయమని, ఆచరణలో సైతం ఈ మహోన్నత నినాదాన్ని అమ లు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
‘బీహార్‌లో ‘మకానా బోరు’్డ ఏర్పాటు చేస్తున్నట్టు బడ్జెట్లో కేంద్రం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నం.. కానీ ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించిన పసుపు బోర్డుకు బడ్జెట్లో పైసా కేటాయించకపోవడం ఏమిటి? తెలంగాణలో పసుపుబోర్డు పరిస్థితి బాహర్ షేర్వానీ.. అందర్ పరేషానీ అన్నట్టుగా ఉన్నది.’ అని ఎద్దేవాచేశారు. పసుపుబోర్డు చైర్మన్‌ను నియమించారని, ఆయన కూర్చునేందుకు కార్యాలయం కూడా లేదని, ఏవైనా పనులు చేయాలన్నా చైర్మన్ వద్ద నిధులు లేవని ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే కేంద్రం పసుపుబోర్డుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
దేశంలో 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని సురేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. వికసిత్ భారత్ అని చెప్తున్న కేంద్రం వారందరికీ మద్దతుగా నిలవాలని కోరారు. దేశంలో 3,700 చిన్న, మధ్యతరహా, భారీ సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. కానీ, చాలా ఏండ్ల నుంచి నిర్వహణ లోపం కారణంగా నీటి నిల్వ సామర్థ్యం 25 శాతానికి తగ్గిందని ఆవేదన వ్యక్తంచేశారు. డ్యామ్‌లలో పూడిక తొలిగించే విషయంలో కేంద్రం చొరవ చూపాలని కోరారు. పూడిక మట్టి రైతులకు జీవ ఎరువుగా ఉపయోగపడుతుందని సూ చించారు. దక్షిణాధి రాష్ర్టాలకు తక్కువ నిధుల కేటాయింపు సరికాదని, నిధుల పంపిణీ, సెస్‌పై అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశాన్ని అభివృద్ధి చేసేందుకు భారీగా వనరులు ఉన్నాయంటునే.. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇవ్వటం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతున్నదని విమర్శించారు. గల్ఫ్ కార్మికులు ఆయా దేశాల్లో ప్రమాదవశాత్తు చనిపోతే వారికి బీమా సౌకర్యం కల్పించేందుకు ‘ప్రవాసీ భారతీయ బీమా యోజన’ను కేంద్రం అమల్లోకి తెచ్చిందని, సాధారణ మరణాలకు సైతం ఈ స్కీంను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.