హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను కేంద్రం ఏదో దాస్తున్నదని, ఎంపీలకు సరైన సమాచారం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎంపీల వాదన వినడంలేదని కేశవరావు చెప్పారు. ఇది స్పెషల్ సెషనా.. నార్మల్ సెషనా, అసలు ఎజెండా ఏమిటి? అని కేశవరావు ప్రశ్నించారు. ఈ సెషన్ తర్వాత శీతాకాల సమావేశాలు ఉంటాయా? కొత్త బిల్డింగ్‌లో జరిగే సమావేశాలు ఏవి? అనేది ప్రభుత్వం చెప్పాలని.. కానీ చెప్పడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్లో సభ్యులను సస్పెండ్ చేస్తూ పోతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.
సనాతన వాళ్లు ఒకటి కావాలని ప్రధాని అన్నారని, అంటే సనాతన, నాన్ సనాతన గొడవ పెట్టుకోవాలా? వారు, వీరు వేర్వేరుగా ఉండాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎజెండా లేకుండా ప్రత్యేక సమావేశాలు ఏమిటో అర్థం కావడం లేదని అభ్యంతరం వ్యక్తంచేశారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఎజెండా మొత్తం చెప్పాలని, కానీ, రెండు మూడు రోజులకు సంబంధించిన అంశాలనే వెల్లడించారని తెలిపారు. మొదటి రోజు గత 75 సంవత్సరాలకు సంబంధించిన అంశాలుంటాయని, ఆ తరువాత రోజు ఫొటో సెషన్ ఉంటుందని చెప్పారని, ప్రత్యేక సమావేశాల్లో ఏం చర్చిస్తారో చెప్పలేదని అన్నారు. మహిళల రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నదని, ఇవే కాకుండా జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. బీఏసీ అయితే తప్ప సమావేశాల ఎజెండా తెలిసేట్టుగా లేదన్నారు. సమావేశాలు ఎప్పటివరకు జరుపుతారో కూడా చెప్పడం లేదని అన్నారు. స్పెషల్ సెషన్స్ పేరుతో ప్రభుత్వం ఏదో దాచి పెడుతున్నదని, ఇలాంటి పద్ధతి ప్రజాస్వామ్యానికి మంచిదికాదని వ్యాఖ్యానించారు.