హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తె లంగాణ): తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ, ఏపీ సాగునీటి దోపిడీకి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తున్నదని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా ప్రెసిడెంట్ నాగరాజు గుర్రాల గురువారం ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డికి సాగునీటి ప్రాజెక్టులపై పరిజ్ఞానం లేదని విమర్శించారు. ‘దేవాదుల ప్రాజెక్టు గోదావరి బేసిన్లో ఉన్న దా? బనకచర్ల ఎక్కడున్నది? ఏ బేసిన్ పరిధిలోకి వస్తుంది? ఏ నదులను అనుసంధారిస్తున్నారు? నల్లమల ఎక్కడుంది? అది ఏపీలోనా? తెలంగాణలోనా?’ అనే ప్రాథమిక ప్రశ్నలకు కూడా సమాధానం తెలియని వ్యక్తి తెలంగాణకు సీఎం కావడం రాష్ట్ర ప్రజల ఖర్మ అని ఎద్దేవా చేశారు.
అఖిలపక్ష సమావేశంలో సీఎం మాట్లాడిన మాటలు.. ఆయన వైఖరిని స్పష్టం చేశాయని తెలిపారు. రేవంత్‌రెడ్డి యాదృచ్ఛికంగా తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారే కానీ, ప్రజలు అయనను నేరుగా ఎన్నుకోలేదని తేల్చిచెప్పారు. తెలంగాణ అస్థిత్వం కోసం నిజమైన పోరాటం చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని, నిస్సహయ పరిస్థితుల నుంచి తెలంగాణను కాపాడేందుకు ఆయన రంగంలోకి రావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై రాష్ట్ర ప్రజలు ఐక్యంగా పోరాడి తెలంగాణ వాటా జలాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.