హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ ) : తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన విమానాశ్రయాలను త్వరగా పూర్తిచేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, విప్ దీవకొండ దామోదర్‌రావు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరారు. మంగళవారం సాయంత్రం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లోని మంత్రి చాంబర్లో ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో విమానశ్రయాల ఏర్పాటు అంశంపై చర్చించారు. వరంగల్‌లోని మామునూర్ విమానాశ్రయం పనులను వెంటనే మొదలుపెట్టి త్వరగా పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు. నిజాం కాలంలో నిర్మించిన మామునూర్ ఎయిర్‌స్ట్రిప్ నుంచి గతంలో విమాన సర్వీసులు నడిచాయని గుర్తుచేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి సమీపాన ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన విమానశ్రయం పనులను వేగవంతం చేయాలని కోరారు. అక్కడ సింగరేణి సంస్థ ప్రధాన కార్యాలయంతోపాటు నవభారత్, ఐటీసీ, మణుగూరు భారజల ప్లాంట్ తదితర పలు రకాల పరిశ్రమలు ఉన్నాయని, దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చిపోయే భక్తులకు ఆ విమానాశ్రయం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని వివరించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన విమానశ్రయాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎంపీలు కోరగా.. అందుకు కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి అమెరికాకు నేరుగా విమాన సర్వీసులు లేకపోవడం విచారకరమని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. మంగళవారం ఆయన రాజ్యసభలో ప్రసంగిస్తూ.. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో ఒకటని, ఈ విమానాశ్రయం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 10.2 లక్షల మంది అమెరికాకు ప్రయాణించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యసభలో ప్రవేశపెట్టిన విమాన వస్తువుల పరిరక్షణ బిల్లు-2025ను ఆయన ప్రశంసించారు. దేశ విమానయాన రంగాన్ని సమూలంగా మార్చేయడంతోపాటు అంతర్జాతీయ విమానయాన రంగానికి మన దేశం నాయకత్వం వహించేలా ఈ బిల్లు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. 2030 నాటికి ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత భారత్ మూడవ అతిపెద్ద విమానయాన మారెట్గా ఆవిర్భవించే అవకాశం ఉన్నదని, దేశంలో విమానాశ్రయాల సంఖ్య 153 నుంచి 350కి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ దిశగా ఎంతో కృషి చేస్తున్న తెలుగు బిడ్డ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును అభినందిస్తున్నట్టు తెలిపారు.
సహకార రంగాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో గుజరాత్‌లోని ఆనంద్‌లో త్రిభువన్ సహకారి యూనివర్సిటీ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు రాజ్యసభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. మంగళవారం రాజ్యసభలో ఆ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. అంతకుముందు ఈ బిల్లుపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. ఈ బిల్లులో తెలంగాణకు ప్రాధాన్యం తగ్గడం ఆందోళన కలిగిస్తున్నదని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒకే ఒక్క సహకార శిక్షణ కేంద్రం హైదరాబాద్‌లో ఉన్నదని ఆయన పేర్కొంటూ.. నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలకు ఈ కేంద్రాలను విస్తరించాలని కోరారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విలువైన 400 ఎకరాల భూములను అమ్మేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. ఆ భూమిలో సహకార యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.