హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూ సెగ ఢిల్లీని తాకింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదరరావు, డాక్టర్ బండి పార్థసారధిరెడ్డి మంగళవారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రత్యేకంగా కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీలు హెచ్‌సీయూలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల అమానుషంగా, క్రూరంగా ప్రవర్తిస్తున్నదని వివరించారు. హెచ్‌సీయూ సున్నిత అంశమని, ఈ వర్సిటీ ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’గా ఉన్నదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హెచ్‌సీయూ భూములు హైదరాబాద్‌కు లంగ్‌స్పేస్‌గా ఉన్నందున వాటిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో విలువైన హెచ్‌సీయూను కాపాడుకొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని గుర్తుచేశారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల విలువైన భూములను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మేందుకు ప్రయత్నిస్తున్నదని, అందులో సహకార యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తద్వారా హెచ్‌సీయూ భూములను పరిరక్షించిన వారమవుతామని చెప్పారు. బీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హెచ్‌సీయూ భూముల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హెచ్‌సీయూ విద్యార్థులు కూడా బుధవారం ధర్మేంద్ర ప్రధాన్‌ను కలుస్తారని, ఈ మేరకు అపాయింట్మెంట్ తీసుకున్నట్టు బీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు. హెచ్‌సీయూ అంశంపై రాజ్యసభలో జీరో అవర్‌లో మాట్లాడేందుకు నోటీసులు ఇచ్చినట్టు వెల్లడించారు.
రాజ్యసభలో ప్రస్తావించిన వద్దిరాజు
అటు రాజ్యసభలో కూడా హెచ్‌సీయూ భూముల అంశాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ప్రస్తావించారు. మంగళవారం రాజ్యసభలో ‘త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయ బిల్లు-2025’పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హెచ్‌సీయూలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేయాలని ప్రయత్నిస్తున్నదని వివరించారు. హెచ్‌సీయూ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ భూముల్లో చెరువులతోపాటు అరుదైన వృక్ష సంపద, పెద్ద సంఖ్యలో నెమళ్లు, జింకలు, పక్షులు ఉన్నాయని, ఇది జీవ వైవిధ్యానికి నెలవుగా ఉన్నదని చెప్పారు. అత్యంత విలువైన ఈ భూములను వేలం వేయొద్దని విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు అభ్యర్థిస్తున్నారని, వీటిని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై, మనందరిపై ఉన్నదని పేర్కొన్నారు.