హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించి ప్రపంచంలో భారత ప్రతిష్ఠను దిగజార్చిన అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎంపీలు అలుపెరుగని పోరాటం చేశారు. గత నెల 31న రాష్ట్రపతి ప్రసంగంతో మొదలైన పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాలు.. సోమవారం వాయిదా పడే దాకా బీఆర్ఎస్ ఎంపీలు అడుగడుగునా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. తిరిగి మార్చి 13న రెండో విడత సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొలి విడత సమావేశాలను అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం కుదిపేసింది.
అదానీ వ్యవహారాన్ని నిగ్గుతేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని, లేదంటే సుప్రీం కోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభలను స్తంభింప చేశారు. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ బీఆర్ఎస్ నోటీసులను తిరస్కరించటంతో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు. కాంగ్రెస్, ఆప్, డీఎంకేతోపాటు భావసారూప్య పక్షాలను ఏకం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమించారు. బీఆర్ఎస్ చేసిన పోరాటానికి దేశంలోని మెజారిటీ విపక్షాలు మద్దతు పలికాయి.
ప్రధానికి చెమటలు పట్టించిన ఎంపీలు
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభలను స్తంభింప చేశారు. బీఆర్ఎస్ ఎంపీలు చేపట్టిన నిరసన పోరాటానికి భావసారుప్యతగల పార్టీలు అబ్బురపడ్డాయి. ఉభయ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగాన్ని సైతం అడ్డుకొని తెగువ చాటిన బీఆర్ఎస్ ఎంపీలను దేశంలోని విపక్ష పార్టీల నేతలు ప్రశంసించారు. తమ రాష్ట్ర సమస్యలపై, కేంద్రం లోగడ రాష్ర్టానికి ఇచ్చిన హామీలను సాధించేందుకు పోరాటం చేస్తూనే, అదేస్థాయిలో దేశాన్ని కుదిపేస్తున్న అదానీ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎంపీలు ప్రదర్శించిన పోరాట పటిమను విపక్ష పార్టీలు అభినందించాయి. రోజూ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే వాయిదా తీర్మానానికి పట్టుబట్టడం, కేంద్రం చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద రోజుకో రూపంలో నిరసన తెలిపిన తీరుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.
మోదీ.. అదానీ మాటెత్తితే ఒట్టు
అదానీ వ్యవహారంపై ఇంత జరుగుతున్నా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రం పార్లమెంటులో నోరు విప్పలేదు. జేపీసీ వేయాలని బీఆర్ఎస్ సహా విపక్ష ఎంపీలు చేసిన డిమాండ్‌కు అంగీకరించి తన చిత్తశుద్ధి నిరూపించుకునే ప్రయత్నం చేయలేదు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ.. తనపై బురదజల్లుతున్నారని బాధపడ్డారు కానీ అదానీ వ్యవహారంలో తన, కేంద్ర ప్రభుత్వ పారదర్శక వైఖరి ఇదీ అని చెప్పలేకపోయారు.
ఈ విషయాన్నే బీఆర్ఎస్ ఎంపీలు ప్రశ్నించారు. ఎందుకు అదానీ వ్యవహారంపై జేపీసీ వేసేందుకు మోదీ వెనకాడుతున్నారని పదే పదే ప్రశ్నించి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. ఉభయసభలు వాయిదా పడినా అదానీ వ్యవహారంపై పోరాటం మాత్రం కొనసాగించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.