హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : బనకచర్ల ద్వారా గోదావరి జలాల దోపిడీకీ తెరలేపిన ఏపీ ప్రభుత్వానికి కేంద్రంలోని మోదీ సర్కారు అండగా నిలుస్తున్నదని బీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత కేఆర్ సురేశ్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రం, ఏపీ ప్రభుత్వం కలిసి తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. ఈ అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన రేవంత్ సర్కారు చోద్యం చూస్తున్నదని దుయ్యబట్టారు. పార్లమెంట్లో, ప్రజాక్షేత్రంలో పోరాడటంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ మాలోతు కవితతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ నీటి హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామని చెప్పారు. నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నప్పటికీ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీ ఒకే అంశంపై చర్చను కొనసాగిస్తూ బనకచర్ల, బీసీ రిజర్వేషన్ల బిల్లులను ప్రస్తావించకుండా బీఆర్ఎస్ గొంతునొక్కుతున్నాయని ధ్వజమెత్తారు. తామిచ్చిన వాయిదా తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. గోదావరిలోని వరద, మిగులు జలాలపై సమగ్రంగా చర్చించి ఒప్పందం కుదుర్చున్న తర్వాతే ప్రాజెక్టులు కట్టుకుంటే అభ్యంతరం ఉండదని చెప్పారు. గతంలో కేసీఆర్ గోదావరి వరద జలాల ఆధారంగా ప్రాజెక్టులు నిర్మించుకోవాలని ఏపీకి సూచించినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని రేవంత్ సర్కారు బనకచర్లను అడ్డుకోవడంలో దారుణంగా విఫలమైందని అన్నారు. కాళేశ్వరంలోని రెండు పిల్లర్లు కుంగితే కాం గ్రెస్, బీజేపీ కలిసి రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. నీటి ప్రాజెక్టులు నిర్మించి ధాన్యం ఉత్పత్తి లో దేశంలో నంబర్‌వన్‌గా నిలిపిన కేసీఆర్‌ను బ ద్నాం చేసేందుకు యత్నిస్తున్నాయని విమర్శించారు.
బీసీ బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్ నాయకులు ట్రైన్లో వచ్చి ఢిల్లీలో డ్రామాలకు తెరలేపారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దుయ్యబట్టారు. తూతూ మంత్రంగా నిర్వహించిన కులగణనను కాంగ్రెస్ పార్టీ రోల్‌మోడల్‌గా చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నా రు. కేసీఆర్ పాలనలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా బీసీల జనాభా 1.85 కోట్లు ఉంటే, కాంగ్రెస్ చేపట్టిన సర్వేలో 1.62 కోట్లు మాత్రమేనని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. ఈ తప్పు డు గణాంకాలే కాంగ్రెస్ కులగణన సర్వే బూటకమన్న విషయాన్ని తెలియజేస్తున్నదని చెప్పారు. అటు బనకచర్ల, ఇటు బీసీ రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్‌పై నెపం నెడుతూ రాజకీయ లబ్ధికోసం ఆరాటపడుతున్నదని దుయ్యబట్టారు. బీసీలను మోసం చేయాలని చూస్తే పులులు, సింహాల మాదిరిగా ఉరికించి తరిమికొడతారని హెచ్చరించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గ కూర్పులో బీసీలకు 42 శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చేతిలో ఉన్న అంశాలను పక్కనబెట్టి ఢిల్లీకి వచ్చి ‘జంతర్ మంతర్’ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. సా మాజిక న్యాయం గురించి గొప్పలు చెప్పుకునే రాహుల్‌గాంధీ, ఖర్గే కాంగ్రెస్ ఢిల్లీ ధర్నాకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అధిష్ఠాన పెద్దలను ధర్నాకు తీసుకురావడం చేతగాని సీఎం బీఆర్ఎస్ను లక్ష్యం చేసుకొని విమర్శలకు దిగడం దుర్మార్గమన్నారు.
ఢిల్లీలో ధర్నా పేరిట హంగామా చేసేందుకు య త్నించిన రేవంత్ అట్టర్‌ఫ్లాప్ అయ్యారని మాజీ ఎంపీ మాలోతు కవిత విమర్శించారు. జంతర్‌మంతర్ ధర్నాకు కేవలం 200మంది మాత్రమే హాజరుకావడం బీసీలపట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. బీసీ బిల్లులను పక్కనబెట్టి కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ వేదికగా డ్రామాలు చేస్తున్నాయని సురేశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయ ని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లపై చట్టం చేయాలని డిమాండ్‌చేశారు. కేసీఆర్ హయాంలోనే బలహీనవర్గాలకు న్యాయం జరిగిందని స్పష్టంచేశారు. అనేక సంక్షేమ పథకాలతో వారి బతుకుల్లో వెలుగులు నింపామని గుర్తుచేశారు.