BRS MP Vaddiraju | రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణన సర్వే తప్పుల తడకగా, కాకి లెక్కలతో అశాస్త్రీయంగా ఉందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 2011లో నిర్వహించిన జన గణన లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.50 కోట్లకు పైగా ఉన్నారని, 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 3,68,76,544 మంది బీసీలు ఉన్నారని రవిచంద్ర మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన సర్వేలో జనాభా 3,70, 77,544 మంది మాత్రమే ఉన్నారని తేలిందన్నారు.
గత పదేండ్లలో తెలంగాణలో బీసీల జనాభా కేవలం రెండు లక్షలు మాత్రమే పెరిగిందనడం విడ్డూరంగా ఉందని రవిచంద్ర పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీలు (ముస్లింలలోని బీసీలు కాకుండా) 52 శాతం అని నిర్ధారణ అయిందన్నారు. కానీ ప్రస్తుతం బీసీల జనాభా (ముస్లింల్లోని బీసీలు మినహా) 46 శాతమేనని, ఆరుశాతం తగ్గించి చూపడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల జనాభాను తగ్గించి చూపడమే కాక,ఈ తప్పులతడక సర్వే నివేదికను క్యాబినెట్ ఆమోదించి, చట్టసభల్లో ప్రవేశపెట్టి ప్రజలకు తప్పుడు సమాచారమిచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తీవ్ర అభ్యంతరకరమన్నారు.
రాజ్యాధికారంలో బీసీలను భాగస్వాములను చేయాలన్న చిత్తశుద్ధి అధికార కాంగ్రెస్ పార్టీలో లోపించిందని ఎంపీ వద్దిరాజు మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేసే ఉద్దేశం కాగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏ కోశానా కూడా లేదని ఈ అశాస్త్రీయ కులగణన సర్వేతో తేటతెల్లమయ్యిందన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ పాలకులకు చాలా చులకన భావం నెలకొందని చెప్పడానికి క్యాబినెట్ కూర్పే ఒక ప్రబల నిదర్శనమని ఎంపీ రవిచంద్ర చెప్పారు. బీసీలలో అత్యధిక సంఖ్యలో ఉన్న మున్నూరు కాపు, యాదవ, ముదిరాజ్, కుర్మలకు మంత్రివర్గంలో చోటివ్వకపోవడం, రాజ్యాధికారంలో న్యాయమైన వాటా దక్కకపోవడం శోచనీయమని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.
బీసీ కులగణన సర్వేలో చోటుచేసుకున్నతప్పులను వెంటనే సరిదిద్దాలని ఎంపీ వద్దిరాజు డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. కేబినెట్ విస్తరణలో నలుగురు బీసీలకు స్థానం కల్పించాలన్నారు. అన్ని రంగాలలో తీవ్ర అన్యాయానికి గురవుతున్న బీసీలను బీఆర్ఎస్ మరింత సంఘటితపరుస్తూ న్యాయమైన హక్కులు, వాటా కోసం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.