హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): మ్యానిఫెస్టోలో హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడమే నిజమైన ‘ఓటు చోరీ’ అని బీఆర్ఎస్ రాజ్యసభాపక్ష నేత కేఆర్ సురేశ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు. రాజ్యసభలో సోమవారం ‘ఎన్నికల సంస్కరణలు’ అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ.. బ్యాలట్ ఎంత శక్తివంతమైందో తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశమంతా చాటిచెప్పారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో 14 ఏండ్లపాటు జరిగిన పోరాటంలో మహిళలు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులతోపాటు అన్ని వర్గాల ప్రజలు ధర్నాలు, నిరసనల్లో పెద్దఎత్తున పాల్గొన్నారని తెలిపారు. తెలంగాణ పోరాటం ఆవశ్యకతను కేంద్రానికి తెలియజేసింది మాత్రం బ్యాలట్ అని స్పష్టం చేశారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కేంద్రం దృష్టికి తీసుకురావడమే లక్ష్యంగా కేసీఆర్ రెండు సార్లు ఎంపీ పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. రెండు వేర్వేరు ప్రాంతాల నుంచి కేసీఆర్ రాజీనామా చేసి.. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆకాంక్ష ప్రజల్లో ఏ స్థాయిలో ఉన్నదో కేంద్రం దృష్టికి తీసుకొచ్చారని వివరించారు. కేసీఆర్ రాజీనామాలతో ఇతర పార్టీల ఎంపీలపై కూడా నాడు తీవ్ర ఒత్తిడి పెరిగిందని పేర్కొన్నారు.
దేశంలోని ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ కోరుకుంటున్నదని సురేశ్‌రెడ్డి తెలిపారు. అయితే ఓటరు లిస్టు పారదర్శకంగా ఉండాలని అన్నారు. రీ వెరిఫికేషన్ పేరుతో అర్హులైన ఓటర్లను నిర్దాక్షిణ్యంగా తొలగించడం సరికాదని స్పష్టంచేశారు. తెలంగాణలో ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భాగంగా మీ-సేవ ద్వారా సర్టిఫికెట్లను ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో నేరుగా పొందుతున్నారని తెలిపారు. అర్హులైన ఓటర్లను ఓటరు లిస్టు నుంచి తొలగించి తిరిగి ఎందుకు చేరుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా పట్టణాల కన్నా.. గ్రామీణ ప్రాంతాల్లోనే ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటున్నదని పేర్కొన్నారు. మరి ట్యాక్స్ పేయర్లు ఎందుకు ఓటు వేసేందుకు ముందు రావడంలేదని ప్రశ్నించారు. ఓటింగ్ శాతం పెంచేందుకు అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజ నటుడు క్యాంపెయిన్ చేస్తున్నా.. ఓటింగ్ శాతం ఆశించిన మేర పెరగకపోవడం పట్ల ఆందోళన వ్యక్తంచేశారు. ఓటు వేసిన తర్వాత ఓటర్లను గౌరవించాల్సిన నేతలు గెలిచిన తర్వాత పార్టీలు మారుతున్నారని మండిపడ్డారు. ఫిరాయింపుల చట్టం మరింత పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మూడు నెలల్లో పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ కమిటీని ఆయన కోరారు.
గతంలో సోమ్‌నాథ్ చటర్జీ లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నప్పుడు అన్ని రాష్ర్టాల స్పీకర్లతో ఓ సెషన్ నిర్వహించి రైట్ టు రికాల్పై చర్చించారని సురేశ్‌రెడ్డి గుర్తుచేశారు. ఇందుకు చేయాల్సిన సంస్కరణలపై ఆయన పలు సూచనలు చేశారని తెలిపారు. ఈవీఎం, బ్యాలట్ పేపర్ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం బూత్ క్యాప్చరింగ్ చేయడం మొదలుపెట్టిందని, ఈవీఎం పద్ధతిలో ఎన్నికల నిర్వహణపై కొన్ని అనుమానాలున్నాయని చెప్పారు. ‘వన్‌నేషన్-వన్ ఎలక్షన్’తో ప్రాంతీయ పార్టీలకు నష్టం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఆయినా తమ అధినేత కేసీఆర్ ఓటర్లపై నమ్మకంతోనే ఎన్నికలకు వెళ్తారని స్పష్టం చేశారు. ‘వన్‌నేషన్-వన్ ఎలక్షన్’ను తమ పార్టీ స్వాగతిస్తున్నదని చెప్పారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఐదేండ్లు అభివృద్ధిపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని అన్నారు.