హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): అయోధ్య రామాలయాన్ని బీజేపీ రాజకీయం చేస్తున్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ప్రజా సమస్యలను పకనపెట్టి అయోధ్య గురించి పార్లమెంట్లో చర్చ పెట్టి తీర్మానం చేయడాన్ని తప్పుబట్టారు. అయితే సభాపతి అధికారాన్ని తాను తప్పుబట్టడం లేదని స్పష్టంచేశారు. ఎన్నికలొస్తున్నాయి కాబట్టే బీజేపీ రామాలయాన్ని, రాముడిని రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. అయోధ్య గుడికి వెళ్లనివారు దేశ వ్యతిరేకులు కాదని పేర్కొన్నారు. అయోధ్య గుడి గురించి మాట్లాడుతున్న మోదీ.. తెలంగాణలోని అతిపెద్ద దేవాలయం యాదగిరిగుట్ట గురించి ఒకసారి కూడా ప్రస్తావించకపోవడం బాధాకరమని చెప్పారు. ఎంపీ వెంకటేశ్ నేత బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడంపై స్పందిస్తూ.. తమ అవసరాలకు అనుగుణంగా నేతలు పార్టీలు మారుతూ ఉంటారని ఎద్దేవా చేశారు. వెంకటేశ్ కాంగ్రెస్లో చేరిన తర్వాత బీఆర్ఎస్పై తప్పుడు ఆరోపణలు చేశారని దుయ్యబట్టారు. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని ఆరోపించడం బాధించిందని చెప్పారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజాతీర్పులను బట్టి మారుతూ ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు గెలుస్తుందని, మిగతా చోట్ల గట్టి పోటీ ఇస్తుందన్న ధీమా వ్యక్తంచేశారు.