BRS MP Badugula Lingaiah Yadav | హైదరాబాద్, అక్టోబరు 29 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ నాయకులు పొర్లు దండాలు పెట్టినా తెలంగాణలో అధికారంలోకి రాదని బీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా ప్రకటించిన తరువాత ఆ పార్టీ అప్రతిష్ట పాలైందన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో లింగయ్య యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఇష్టమొచ్చినట్లుగా హామీలు ఇస్తుందన్నారు. కానీ వాటిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా సరిగా అమలు కాలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రంలో అంధకారమే రాజ్యం ఏలుతుందని లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు. ఆపద మొక్కులు తప్ప వారికి ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాలు ఏనాడు పట్టవన్నారు. గతంలో పీసీసీ అధ్యక్ష పదవిని డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారని ఆరోపించిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్ చేరారన్నారు. రెండు మూడు రోజులుగా గాంధీ భవన్లో ధర్నాలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నిర్ణయాలు, టిక్కెట్ల పంపిణిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్న నేతలు పార్టీని వీడే పరిస్థితి వచ్చిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలని లింగయ్య యాదవ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో మేమంటే మేము సీఎం అంటూ ప్రకటన చేస్తున్నారని, వారి గొడవ అంత కూర్చిల కోసమేనని అన్నారు. వారు ఏనాడు ప్రజా సంక్షేమం, రాష్ట్ర అవసరాలను గుర్తించలేదన్నారు. తెలంగాణ ఎన్నికలపై వచ్చే సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. మూడో సారి కేసీఆర్ సీఎం ఖావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేపట్టే బస్సు యాత్ర ఎందుకు పనికి రాదన్నారు.