హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కలే బీఆర్ఎస్ గత పాలనలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. శాసనమండలిలో శనివారం జరిగిన బడ్జెట్‌పై చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పాల్గొని మాట్లాడారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదమని వారు మండిపడ్డారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేంద్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైంది. అనంతరం బడ్జెట్‌పై చర్చను శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రారంభించారు.
బడ్జెట్‌పై సభ్యుల చర్చ అనంతరం సభ్యుల అభ్యంతరాలపై డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు. అనంతరం మండలిని ఈనెల 31కి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వాయిదా వేశారు. చర్చల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, సత్యవతి రాథోడ్, సురభి వాణిదేవి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, సురభి వాణిదేవి, ఎల్ రమణ, శేరి సుభాశ్‌రెడ్డి, తాతా మధు, మహమూద్ అలీ, నవీన్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ సభ్యులు టీ జీవన్‌రెడ్డి, తీన్మార్ మల్లన్న, వెంకట్, బీజేపీ సభ్యులు ఏవీఎన్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.
రాష్ట్ర బడ్జెట్ గందరగోళంగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాన్ని అధికార పక్షం తిట్టడమే బడ్జెట్ లక్ష్యంగా కనిపించిందని పేర్కొన్నారు. రాష్ర్టాన్ని అప్పులకుప్ప చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఏడు నెలల్లోనే ఈ ప్రభుత్వం 35 వేల కోట్ల అప్పు చేశారని, ఈ ప్రభుత్వం కూడా ప్రతి నెల 5 వేల కోట్ల అప్పు తీసుకుంటున్నదని విమర్శించారు. ఎఫ్ఆర్బీఎం పరిధిలోలేని అప్పులు రూ.30 వేల కోట్లని, ఏడాది అప్పులే రూ.1 లక్ష కోట్ల అప్పుల అంచనా కనిపిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఉన్నదని వాటిని అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు త్వరితగతిన రైతు భరోసా నిధులను రైతులకు చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు ఇస్తామన్న రూ.15 వేలను సకాలంలో ఇవ్వాలని కోరారు. రుణమాఫీని ఎప్పటిలోగా పూర్తిచేస్తారో సభకు తెలపాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన అన్నిరకాల ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లించాలని కోరారు.
బడ్జెట్ ప్రసంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తి ట్టడానికే ప్రాధాన్యం ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నదో చెప్పి, ప్రజల మెప్పు పొందాల్సింది పోయి దూషించడం ఏమిటని ప్రశ్నించారు. తుమ్మిడిహట్టికి ఎలాం టి అనుమతులు తీసుకోకుండా కాల్వలు తవ్వి, పైపులు కొనుగోలు చేశారని, ఇవన్నీ కాంట్రాక్టర్ల లబ్ధి కోసమేనని విమర్శించారు.
మాజీ సీఎం కేసీఆర్ నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల వల్ల ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి విమర్శించడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ధ్వజమెత్తారు. సీతారామ ప్రాజెక్టు నుంచి వచ్చిన నీటి నుంచి 70 వేల ఎకరాల్లో విస్తారంగా పంటలు పండించామని, వస్తే చూపిస్తామని చెప్పారు. సత్యదూర ఆరోపణలు మానుకోవాలని, లేకుంటే రాజీనామా చేయాలని, తాను మాట్లాడింది తప్పయితే తానే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధికి చర్చకు వచ్చినా తాను సిద్ధమేనని చెప్పారు. విద్యుత్తు రంగాన్ని కేసీఆర్ ఎంతగానో అభివృద్ధి చేశారని కొనియాడారు.