MLC Tata Madhu | హైదరాబాద్ : కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. తుమ్మల నాగేశ్వర్ రావు ఓడిపోయి పామాయిల్ తోటలో ఉంటే.. కేసీఆర్ పిలిచి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు అని తాతా మధు గుర్తు చేశారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావుతో కలిసి ఎమ్మెల్సీ తాతా మధు మీడియాతో మాట్లాడారు.
జూబ్లీహిల్స్‌లో గెలవబోమని కాంగ్రెస్ కార్యకర్త మొదలు సీఎం వరకు అర్థమైంది. ఏం చేయాలో పాలుపోక మతం, కులం విషయంలో కింది స్థాయికి వెళ్లి రాజకీయం చేస్తున్నారు. మనిషికి ఓ కులాన్ని ఎత్తుకొని మంత్రులు కులపోరాటాలు చేస్తున్నారు. కులానికి, రాజకీయ పదవులకు సంబంధం లేదు. స్థాయిని పక్కన పెట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం రాజకీయం చేయడం తుమ్మల నాగేశ్వర్ రావుకు తగదు. మాగంటి సునీత కన్నీళ్లు పెట్టుకుంటే కూడా మంత్రి తుమ్మల చిల్లరగా మాట్లాడారు. మాగంటి సునీతపై దుర్మార్గమైన ప్రచారం మొదలు పెట్టారు. ఆమెకు అందరి దీవెనలు ఉన్నాయి, జూబ్లీహిల్స్‌లో గెలుపు ఖాయం అని తాతా మధు ధీమా వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరణ చేయవద్దని అడ్డుకున్న నేతలను పక్కన పెట్టుకొని మైత్రీవనంలో పెడతామని మాట్లాడుతున్నారు. దమ్ముంటే ఏం అభివృద్ది చేశారో, హామీలు అమలు చేశారో చెప్పాలి. కమ్మ సామాజిక వర్గానికి ఖానామెట్‌లో ఐదెకరాల భూమి ఇచ్చారు. ఎన్టీఆర్‌పై అత్యంత అభిమానం ఉన్న నాయకుడు కేసీఆర్, కుమారుడికి కూడా ఆయన పేరు పెట్టారు. ఎన్టీఆర్‌తో ప్రారంభమైన సామాజిక విప్లవం తెలంగాణ వచ్చిన తర్వాత సంపూర్ణం అయింది అని తాతా మధు పేర్కొన్నారు.