హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తేతెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాటి క్యాబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎన్నికల నిర్వహణపై 20 నెలలుగా కాలయాపన చేస్తుండటంతో పల్లెల్లో పాలన పడకేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఏ గ్రామానికి వెళ్లినా చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయని, దుర్గంధం వెదజల్లుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో వెలుగులు విరజిమ్మిన గ్రామాలు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ హయాంలో పంచాయతీలకు ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ కూడా పోయించే దిక్కులు లేకుండా పోయిందని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు వాసుదేవరెడ్డి, వెంకటేశ్వర్లు, రాఘవతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సెంట్రల్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ల నుంచి నిధులు నిలిచిపోవడంతో పల్లెలన్నీ మురికి కూపాలుగా మారాయని పేర్కొన్నారు. నిర్వహణ ఖర్చుల భారంతో కార్యదర్శులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ దవాఖానల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, విష జ్వరాలు విజృంభిస్తున్నా, డెంగీ కేసులు నమోదవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు తప్పటడుగులు వేస్తున్నదని రవీందర్రావు నిప్పులు చెరిగారు. నాడు ఓట్ల కోసం మాయమాటలు చెప్పిన రేవంత్‌రెడ్డి నేడు నట్టేట ముంచేందుకు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం ఒప్పుకోవడంలేదని సాకులు చూపుతూ పదే పదే ఎన్నికలను వాయిదా వేస్తున్నారని విమర్శించారు. ఐదేండ్లకోసారి లోకల్‌బాడీ ఎన్నికలు నిర్వహించాలని రాజీవ్‌గాంధీ తెచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణలను కాంగ్రెస్ ప్రభుత్వమే ఉల్లంఘించడం శోచనీయమని పేర్కొన్నారు. రేవంత్ 20 నెలల పాలనలో అన్ని రంగాలు సర్వనాశనమయ్యాయని, అన్ని వర్గాలు నిరాశ లో ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలు పరిష్కరించాలని, హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నదని రవీందర్రావు ఆరోపించారు. యూరియా కోసం రైతులు అరిగోస పడుతుంటే సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నదని నిప్పులు చెరిగారు. యూరియా కోసం క్యూలలో నిల్చున్న రైతులు కేసీఆర్ పాలనను గుర్తుచేసుకుంటున్నారని చెప్పారు.