Medak | మెదక్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలోఈ నెల 17వ తేదీన మెదక్ జిల్లా కేంద్రంలోని సాయిబాలాజీ గార్డెన్స్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ మెగా జాబ్ మేళా ద్వారా స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జాబ్ మేళాలో 70 కంపెనీలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బట్టకాల్చి మీద వేస్తున్నాయన్నారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. తెలంగాణలో వ్యవసాయ ఎంతో అభివృద్ధి చెందుతుంది. వైద్యం, విద్య రంగాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1,32,939 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. మూడు మెడికల్ కాలేజీల నుంచి 40 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రయివేట్ రంగంలోనూ ఉద్యోగాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. నేను పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలని ఉంది.. అవకాశమిస్తే బరిలో ఉంటాను. సీఎం కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యం అని సుభాష్ రెడ్డి తెలిపారు.