Medak | మెదక్ : ఆ విద్యార్థినికి తల్లిదండ్రులు లేరు. అయినప్పటికీ ఎలాంటి ఆత్మస్థైర్యం కోల్పోకుండా పది ఫలితాల్లో టాపర్గా నిలిచింది. చదువుల్లో ఎంతో చురుకైన ఆ విద్యార్థినికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి అండగా నిలిచారు. ఆమె ఉన్నత చదువులకు అయ్యే ఖర్చు అంతా తానే భరిస్తానని సుభాష్ రెడ్డి భరోసా ఇచ్చారు.
హవేలీ ఘన్పూర్ మండలం పోచమ్మరాల్కు చెందిన దివ్య.. చిన్నప్పట్నుంచి చదువుల్లో చురుకైన విద్యార్థిని. అయితే ఆమె తల్లి బండ్లకాడి చంద్రకళ.. అనారోగ్యంతో కొద్ది నెలల క్రితం చనిపోయింది. భార్య మరణాన్ని తట్టుకోలేని భర్త సాయిలు సైతం నెల రోజులలోపే మరణించాడు. దీంతో దివ్య అనాథగా మారింది. ఇక తన అమ్మమ్మ ఊరైన పోడ్చన్పల్లి(పాపన్నపేట మండలం)కి చేరుకుంది దివ్య. తల్లిదండ్రులను కోల్పోయిన దివ్య.. ఎలాంటి మనోవేదనకు గురి కాకుండా, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా చదువు బాగా చదివింది. ఇటీవల విడుదలైన పది ఫలితాల్లో పాపన్నపేట మండలం టాపర్గా నిలిచింది. విషయం తెలుసుకున్న శేరి సుభాష్ రెడ్డి.. దివ్యను తన ఇంటికి పిలిపించుకుని శాలువాతో సత్కరించి సన్మానించారు. అనంతరం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దివ్య ఉన్నత విద్యకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని సుభాష్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో దివ్య ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.