Patnam Mahender Reddy | హైదరాబాద్, అక్టోబరు 3 (నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలిచిన పట్నం మహేందర్‌రెడ్డిని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌గా నియమించింది. ఈ నియామకం గత మార్చి 15 నుంచి అమల్లోకి వస్తుందని గెజిట్ విడుదల చేసింది. గెజిట్‌ను ఇన్నాళ్లూ రహస్యంగా ఉంచిన ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. తమ పార్టీ నుంచి అర్హులైన శాసనమండలి సభ్యులు లేరనే నిస్సహాయ స్థితిలో బీఆర్ఎస్ సభ్యుడికి కీలక పదవి ఇచ్చింది. ఎన్నికలకు ముందు పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి సునీతా మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆమె మల్కాజ్గిరి ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. పట్నం మహేందర్‌రెడ్డి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరారని, ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ గతంలోనే శాసనమండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది.
ఆయనపై ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోకపోగా తాజాగా శాసనమండలి చీఫ్ విప్‌గా నియమించారు. ప్రతిపక్ష పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడిని ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఎలా నియమిస్తారని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన అరికెపూడి గాంధీని అసెంబ్లీలో పీఏసీ చైర్మన్‌గా నియమించారని, దానిపై స్పీకర్ ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వకముందే మరొకరికి ఇలా అవకాశం ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. దీనిపై మరోసారి మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో ఉంది. గత మార్చి 15 నుంచే మహేందర్ రెడ్డి నియామకం అమల్లోకి వస్తుందని గెజిట్‌లో ప్రభుత్వం పేర్కొన్నది. అయితే అదే ప్రభుత్వం… పట్నం మహేందర్‌రెడ్డి, జూన్ 2, ఆగస్టు 15న రెండు సార్లు జాతీయ జెండాను ఎగురవేయడానికి మేడ్చల్ జిల్లాలో అవకాశం కల్పించారు. ఆ ప్రభుత్వ ఆదేశాల్లో మాత్రం మహేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగానే పేర్కొన్నారు. ప్రభుత్వమే ఒక పదవి ఇచ్చి, ఆ పదవిని తాను ఇచ్చే ఆదేశాల్లో పేర్కొనకపోవడం గమనార్హం.