హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమే అభివృద్ధి అని మోదీ ప్రభుత్వం అనుకుంటున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ విమర్శించారు. మోదీ ప్రధాని అయ్యాకే దేశం అప్పుల కుప్పగా మారిందని మండిపడ్డారు. చేనేత రంగంపై జీరో జీఎస్టీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గుండు ప్రభాకర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీ తీసుకొచ్చిన మేకిన్ ఇండియా ఏమైందని, తెలంగాణలోని కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు కేంద్రం నిధులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 18 వేల మగ్గాలను గుర్తించి, చేనేత రంగానికి అండగా నిలిచారని గుర్తు చేశారు. ప్రతి మగ్గానికి జియో ట్యాగింగ్ చేశారని పేర్కొన్నారు. వస్త్ర రంగానికి ప్రముఖమైన రాష్ట్రంగా గుర్తింపు పొందిన మహారాష్ట్రకు చెందిన టైక్స్‌టైల్ అధికారులు సైతం తెలంగాణకు వచ్చి అధ్యయనం చేసి వెళ్లారని, ఇక్కడి పథకాలను అక్కడ అమలు చేస్తామని వారు చెప్పారని అన్నారు. 2017లో చేనేతపై 12 శాతం జీఎస్టీ పెంచారని, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ చేనేతపై 5శాతానికి తగ్గించారని పేర్కొన్నారు. చేనేతపై కేంద్రం జీఎస్టీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ప్లీనరీలో తీర్మానం చేశామని చెప్పారు.
వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ లక్షలాది లేఖలను ప్రధానికి రాసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ బోర్డు, బునకర్ బీమా యోజన, వర్కర్ కం ఓనర్ స్కీం సహా అనేక పథకాలను రద్దు చేసింరని మండిపడ్డారు. చేనేత రంగంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు నిధులు కేటాయించాలని, నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను మంజూరు చేయాలని, టైక్స్‌టైల్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.