భద్రాచలం, ఏప్రిల్ 21: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ.. కాంగ్రెస్ చేతిలో ఆగమవుతుంటే బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులు చూస్తూ ఊరుకోవద్దని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఆగమవుతున్న రాష్ర్టాన్ని కాపాడుకునేందుకు గులాబీ కండువానే శ్రీరామరక్ష అవుతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కాంగ్రెస్ మరింత ఆగం చేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. మోసపోతే గోస మిగులుతుందంటూ గతంలో కేసీఆర్ పదేపదే చెప్పారని గుర్తుచేశారు. మోసం కాంగ్రెస్ నైజమని అన్నారు. భద్రాద్రి జిల్లాలో సోమవారం పర్యటించిన కవిత.. ఇక్కడి హరిత టూరిజం హోటల్లో భద్రాచలం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా తెల్లం వెంకట్రావును ఇక్కడి ఓటర్లు గెలిపిస్తే.. ఆయన కాంగ్రెస్లో చేరి ద్రోహిగా మారారని విమర్శించారు. భద్రాద్రిలో ఉప ఎన్నిక వస్తే ఎగిరేది గులాబీ జెండాయేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వెంట నడిచిన వారి శ్రమ వృథాగా పోదని భరోసా ఇచ్చారు.
అప్పులపై అబద్ధాలు.. ప్రశ్నిస్తే బుకాయింపులు..
రైతులకు, రైతు కూలీలకు ఆత్మీయ భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని కవిత విమర్శించారు. అప్పులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విపరీతమైన అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. లెక్కలు అడిగితే చెప్పబోమనడమేంటని అన్నారు. తెలంగాణ ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకు మంచి చేసినా, చెడు చేసినా ఆ లెక్కలను ప్రభుత్వం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వస్తే కరువొచ్చినట్టేనని మరోసారి రుజువైందని అన్నారు. రూ.1.60 లక్షల కోట్లకు పైగా అప్పు తెచ్చి ఏం చేశారని ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బుకాయిస్తున్నదని మండిపడ్డారు. రూ.40 వేల కోట్ల విలువైన భూములను రూ.10 వేల కోట్లకు తాకట్టు పెట్టిందని విమర్శించారు. అయితే ఆ రూ.10 వేల కోట్లతో రైతుభరోసా ఇచ్చామని, రుణమాఫీ చేశామని మంత్రులు చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా మూడు పైసలు కూడా తేలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాత్రం ఆనాడు ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సీతారామ ప్రాజెక్టును తెచ్చి లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందేలా చేశారని గుర్తుచేశారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు బానోతు హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు, బానోతు చంద్రావతి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
రజతోత్సవ సభకు కదం తొక్కాలి
రజతోత్సవ సభకు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు కదం తొక్కాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సోమవారం భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయిలోని జాతీయ రహదారిపై ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు. బీఆర్ఎస్ నాయకులు జై తెలంగాణ.. కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి.. మళ్లీ కాబోయే సీఎం కేసీఆర్ అని నినాదాలు చేస్తుండటంతో ఎమ్మెల్సీ కవిత సైతం వారితో నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.