MLC Kavitha | ప్రపంచ చారిత్రక వారసత్వ సంపద అయిన రామప్ప దేవాలయం సమీపంలో ఓపెన్ కాస్ట్ గనులను ఏర్పాటు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. సోమవారం రామప్ప రామలింగశ్వేరస్వామిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2012లోనే రామప్ప ఆలయానికి 5 కి.మీ.ల దూరంలో ఓపెన్ కాస్ట్ మైన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఉద్యమ నాయకుడుగా కేసీఆర్ ఆ ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా ఆ ప్రయత్నాలను ముందుకు సాగనివ్వలేదని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ ఓపెన్ కాస్ట్ మైన్ పేరుతో బొగ్గు తవ్వకాలకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆలయానికి 5 కి.మీ.ల దూరంలో బ్లాస్లింగులు జరిపితే ఆలయం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప ఆలయంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో ఈ ఒక్క ప్రయత్నంతో తేలిపోతుందన్నారు. కేసీఆర్ ప్ర ప్రభుత్వంలోనే రామప్ప ఆలయానికి గుర్తింపు తెచ్చుకున్నామని గుర్తు చేశారు. అప్పుడు చిన్నపాటి పనులు పెండింగ్ లో ఉంటే ఏడాదిన్నరగా పట్టించుకోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మంత్రి సీతక్క ఇప్పుడు అందాల పోటీల కోసం పై పై మెరుగులు దిద్దుతున్నారని అన్నారు.
ములుగు నియోజకవర్గంలో రైతులు, ప్రజలు చనిపోతున్నా మంత్రి సీతక్క పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సీతక్కకు ప్రజలపై ప్రేమ ఉంటుంది తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండదా అని ప్రశ్నించారు. అకాల వర్షాలకు పంట దెబ్బతిని ఒక రైతు చనిపోయారని, ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఇదే నియోజకవర్గంలో ప్రజలు చనిపోయారని తెలిపారు. ఇంత జరుగుతున్నా మంత్రి సీతక్క ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత సీతక్కకు అంతటి ప్రాధాన్యత ఉంటుందని స్వయంగా సీఎం చెప్పారని గుర్తు చేశారు. అంత ప్రాధాన్యం ఉన్న సీతక్క నియోజకవర్గ ప్రజలకు ఏ ఒక్క కొత్త పథకాన్ని కూడా అందించలేకపోయారని అన్నారు. కొత్తగా ఒక్క పింఛన్ ఇవ్వలేదని, ఉన్న పింఛన్ లు పెంచలేదని, మహాలక్ష్మీ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని అన్నారు. గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో కొత్తగా చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. దేశ సరిహద్దుల్లో ఒకవైపు యుద్ధం జరుగుతుంటే మన ముఖ్యమంత్రి అందాల పోటీలకు హాజరయ్యారని.. ఈ ముఖ్యమంత్రికి, మంత్రి సీతక్కకు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజలపై లేదన్నారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుజపురంలో ఎరుకల నాంచారమ్మ ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రామానుజపురంలో నాంచారమ్మ జాతరకు హాజరై నాంచారమ్మ తల్లికి పూజలు చేశారు. అనంతరం ఎరుకల కులస్తులతో కలిసి కవిత సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, 800 ఏళ్ల క్రితమే ఇక్కడ నాంచారమ్మ ఆలయం ఉన్నట్టుగా గురుతులు ఉన్నాయని తెలిపారు. ఈ జాతరలో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి 6 గంటల పాటు ప్రయాణించి వచ్చానని అన్నారు. నాంచారమ్మ ఆలయ నిర్మాణంతో పాటు జాతరకు ప్రభుత్వం చేయూతనివ్వాలన్నారు. మంత్రి సీతక్క సొంత నియోజకవర్గం కాబట్టి ఆమె చొరవ చూపించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎరుకల నాంచారమ్మ జాతర అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. అత్యంత వెనుకబడిన ఎరుకల కులం వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ ఎరుకల ఎంటర్ప్రెన్యూర్ షిప్ పథకాన్ని తీసుకువచ్చారని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం అధ్యక్షుడు లోకిని రాజు, నాయకులు కేతిని రాజశేఖర్, లోకిని సమ్మయ్య, మానపాటి రమేష్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.