హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): కరెంటు సరఫరాపై కట్టుకథలు చెప్పడం మానేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత హితవుపలికారు. పెద్దపల్లిలో ఎన్టీపీసీ విద్యుత్తు కేంద్రం ద్వారా తెలంగాణకు ప్రధాని మోదీ ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నదంటూ కిషన్‌రెడ్డి ట్విట్టర్లో చేసిన పోస్టుపై ఆమె అదే వేదికగా స్పందించారు. తెలంగాణ విద్యుత్తు పీక్ డిమాండ్ 15,500 మెగావాట్లుగా ఉంటే ఎన్టీపీసీ ద్వారా తెలంగాణకు 680 మెగావాట్లు మాత్రమే సరఫరా అవుతున్నదని తెలిపారు.
అంటే తెలంగాణ వినియోగిస్తున్న విద్యుత్తులో పెద్దపల్లి ఎన్టీపీసీ ద్వారా వస్తున్నది నాలుగు శాతం మాత్రమేనని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే నిరంతర విద్యుత్తును అందజేస్తున్నదంటూ అబద్ధాలను వ్యాప్తిచేయవద్దని సూచించారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే తెలంగాణలో కరెంటు కష్టాలు తీరాయని తెలిపారు.