MLC Kavitha | హైదరాబాద్ : జానపద సాహిత్యానికి తెలుగునాట పట్టం కట్టిన మహనీయుడు బిరుదురాజు రామరాజు శతజయంతి సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘన నివాళులర్పించారు.
సంస్కృత, తెలుగు పద్య కవిత్వంలో అద్భుత పాండిత్యమున్నా జనం నాలుకల మీద ప్రవాహంలా జాలువారే “జానపదం” పై పరిశోధన చేసిన మట్టి బిడ్డ అని కవిత కొనియాడారు. జానపద సాహిత్యంలో దక్షిణ భారతంలోనే మొట్టమొదటి పరిశోధకుడు బిరుదురాజు రామరాజు అని కవిత గుర్తు చేశారు. 1955లో వచ్చిన వారి “జానపద గేయ సాహిత్యం” గ్రంథం తర్వాతే అనేక యూనివర్సిటీలు జానపద కళల, సాహిత్య శాఖలను ఏర్పాటు చేసి కోర్సులు ప్రారంభించాయని తెలిపారు. తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా అందులో చేరక నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని చెరసాల ఊచలను ముద్దాడిన తెలంగాణ యోధుడు అని ప్రశంసించారు. వారి శతజయంతి సందర్భంగా ఆ సాహితీ స్రష్టకు, అక్షర యోధునికి ఘన నివాళులు ఆర్పిస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.