BRS MLC Kavitha | కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైనా ఆ పార్టీలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎందుకు చేరారో చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయించిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ ప్రజలు క్షమించరని స్పష్టం చేశారు. ఆదివారం బాన్సువాడలో పర్యటించిన కవిత మీడియాతో మాట్లాడుతూ కన్న తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీకి పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్రోహం చేశారని ఆరోపించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో బాన్సువాడ నియోజకవర్గానికి ఏడాదికి రూ.1000 కోట్ల చొప్పున అప్పటి సీఎం కేసీఆర్ రూ.10,000 కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడకు ఏడాదికి రూ.1000 కోట్లు తీసుకురాగలుగుతారా ? అని ప్రశ్నించారు.
రైతు భరోసా సాయం విషయంలో మాట మార్చిన కాంగ్రెస్ పార్టీలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎందుకు కొనసాగుతున్నారు ? అని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ప్రజలకు పనికిరాని పార్టీలోకి మారుడు ఎందుకు ? అని నిలదీశారు. కొంతమంది నాయకులు పార్టీ మారినా బీఆర్ఎస్తోనే ప్రజలు, కార్యకర్తలు ఉన్నారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బాన్సువాడతోపాటు తెలంగాణ వ్యాప్తంగా గులాబీ జెండా ఎగరేద్దాం అని ఆమె పిలుపునిచ్చారు.
రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని రూ.12 వేలు ఇస్తున్నారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోతల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని ఎద్దేవా చేశారు. రైతుల కోసం కేసీఆర్ పెట్టిన అన్ని పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. మహిళలకు, ఆటో డ్రైవర్లకు, కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిందని చెప్పారు.
ఆటో డ్రైవర్లకు ఏడాదికి ఇస్తామన్న రూ.12 వేలను వెంటనే చెల్లించాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం చూపుతున్నదని అన్నారు. గత ఏడాది కాలంలో ఒక్క ప్రాజెక్టులో కూడా తట్ట మట్టి కూడా ఎత్తిపోయలేదని ఆరోపించారు. గురు కులాల్లో తిండి సరిగ్గా లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అనేక ప్రభుత్వ గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు మరణిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతి పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాగర్ కర్నూల్ నుంచి నాలుగు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. జగన్నాథం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.