హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం విధానం కేసులో తీహార్ జైలులో కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆమె కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు. దీంతోపాటు ఆమెకు పలు గైనిక్ సంబంధమైన సమస్యలు తలెత్తినట్టు సమాచారం. తీహార్ జైలు అధికారులు గురువారం ఆమెను ఎయిమ్స్‌కు తీసుకువచ్చి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. నివేదికలను ఎయిమ్స్ వైద్యులు జైలు అధికారులకు పంపించారు.
ఖైరతాబాద్, ఆగస్టు 22 : మాలలు మనువాదులు అంటూ వ్యాఖ్యానించిన ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణమాదిగ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎస్సీ రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి కో కన్వీనర్లు జీ చెన్నయ్య, చెరుకు రాంచందర్ మాట్లాడుతూ.. మంద కృష్ణ వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. మాలలు ఎప్పటికీ అంబేద్కరిస్టులేనని పేర్కొన్నారు. నిరాధారణమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మనువాద పార్టీ బీజేపీతో మంద కృష్ణ పొత్తు పెట్టుకున్నట్టు ఆరోపించారు.
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : నిరుపేద కుటుంబంలో పుట్టి పశువుల కాపరిగా మారిన ఓ యువకుడు, అనంతరం పట్టుదలతో చదివి పీహెచ్డీ పట్టా సాధించాడు. అతనే సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాఘవపురం(రామసముద్రం)గ్రామానికి చెందిన కత్తి వీరయ్య. ఉస్మానియా యూనివర్సిటీ జాగ్రఫీ డిపార్ట్మెంట్ నుంచి ప్రొఫెసర్ లక్ష్మయ్య గైడెన్స్‌లో ‘అప్లికేషన్ ఆఫ్ జీఐఎస్ అర్బన్‌ల్యాండ్ యూజ్ చేంజెస్ ఇన్ సూర్యాపేట మున్సిపల్ ఏరియా నల్లగొండ డిస్ట్రిక్ట్’ అనే అంశంపై వీరయ్య పీహెచ్డీ పొందారు. తన పాఠశాల విద్యను నేరుగా మూడో తరగతి నుంచి ప్రారంభించానని, నాటి నుంచి నేటివరకు చదువుతూనే ఉద్యమాల్లో పాల్గొంటూ.. అంబేదర్ చెప్పినట్టు మనం ఏ సమాజం నుంచి వచ్చామో ఆ సమాజం అభివృద్ధి కోసం పాటుపడాలనే భావనతో జీవితంలో కష్టాలను ఎదురొంటూ పీహెచ్డీ సాధించినట్టు వీరయ్య తెలిపారు.