MLC Kavitha | హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లకై జులై 17న రాష్ట్ర వ్యాప్తంగా రైల్‌రోకో కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. అన్ని బీసీ సంఘాల నాయకులను కలుపుకొని రైల్‌రోకోలో పాల్గొంటామని ఆమె పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి చేస్తామన్నారు. ఢిల్లీ పాలకులకు తెలంగాణ బీసీల పౌరుషం ఏంటో చూపిస్తాం. ఢిల్లీ పాలనకు సెగ తాకేలా రైల్ రోకో ఉంటుంది. 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు నిర్వహించనివ్వబోవం. 42 రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తుంది. బీసీ విద్యార్థులు, మహిళలు ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున కలిసిరావాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తోంది అని కవిత ప్రకటించారు.
తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఒత్తిడితోనూ అసెంబ్లీలో ప్రభుత్వం మూడు బీసీ బిల్లులు పెట్టింది. వార్డు మెంబర్, సర్పంచ్‌లు కాని అనేక కులాలు బీసీల్లో ఉన్నాయి. అసెంబ్లీ గడప తొక్కని అనేక కులాలు ఉన్నాయి. రాజకీయ అవకాశాల్లో బీసీ మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మహిళా రిజర్వేషన్లలో బీసీలకు ఉప కోటా ఉండాలి. ఇది రాజకీయ వేదిక కాదు… ఇది మానవ హక్కలు, సామాజిక హక్కలు వేదిక. సమాజంలో 56 శాతం జనాభాకు సంబంధించి హక్కులు కోరుతుంటే అవి మానవ హక్కులు కావా..? ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది.. కాబట్టి అందరూ కలిసికట్టుగా హక్కల కోసం పోరాటం చేయాలి. సరైన సమయంలో జాగృతి మాట్లాడింది కాబట్టి అసెంబ్లీలో మూడు బిల్లులు వచ్చాయి. అదే స్పూర్తితో బీసీ బిల్లులను కేంద్రం ఆమోదించేలా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కవిత పేర్కొన్నారు.
ఢిల్లీకి బిల్లు పంపించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీసీ బిల్లు గురించి ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. రఘునందన్ రావు బీసీల కోసం ఎందుకు మాట్లాడడం లేదు..? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని ప్రతీ ఒక్కరు రఘునందన్ రావును ప్రశ్నించాలి. కులగణన వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల వారీగా ప్రకటించాలి. రౌండ్ టేబుల్ సమావేశానికి రానివ్వకుండా బీసీ నాయకులను మెదక్‌లో కొంత మంది బెదిరించే ప్రయత్నం చేశారు. దీన్ని బట్టే వాళ్లు భయపడుతున్నారని అర్థమవుతోంది అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.