MLC Kavitha | కరీంనగర్ : ఆడబిడ్డలో ఆత్మస్థైర్యం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR )ది అని బీఆర్ఎస్( BRS Party ) ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. మహిళా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. పోలీస్ శాఖతోపాటు ఇతర శాఖల్లో తెలంగాణ ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుంది అని కవిత గుర్తు చేశారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ రాంలీల మైదానంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక( Womens Day )ల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు దేశంలో ఎక్కడా లేని విధంగా 54 లక్షల మందికి రూ. 18 వేల కోట్లను స్వాలంబన కింద అందిస్తున్నాం అని తెలిపారు. వడ్డీ లేని రుణాలు.. అభయహస్తం త్వరలోనే విడుదల చేస్తామన్నారు. వీఏవోలకు యూనిఫామ్లు ఇచ్చేలా కృషి చేస్తాం అన్నారు.
ఇన్నాళ్లు ఇంటికి పరిమితమైన ఆడబిడ్డలు ఇప్పుడు ఉద్యోగం కోసం బయటకు వస్తున్నారు అని కవిత తెలిపారు. ఉద్యోగం కోసం బయటకు వచ్చే ఆడబిడ్డలకు భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఆడబిడ్డలను ఉన్నత చదువుల కోసం పక్క ఊరుకు పంపించాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. కానీ రూ. 8000 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో ఆడపిల్లలకు టాయిలెట్లు నిర్మిస్తున్నాం అని తెలిపారు. ఇల్లు అద్దెకు దొరకకుండా ఇబ్బందులు పడుతున్న దళిత బిడ్డల కోసం ఎస్సీ డిగ్రీ కాలేజీలు, హాస్టళ్లను ఏర్పాటు చేశామన్నారు.