Deshapathi Srinivas | హైదరాబాద్ : సీఎం రేవంత్ సర్కార్ సంకుచిత రాజకీయాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు అన్ని తెలుగు పుస్తకాల్లోని ముందుమాటలో కేసీఆర్ పేరుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఓర్వలేకపోతుందన్నారు. ఇప్పటికే విద్యార్థులకు పంపిణీ చేసిన 2 కోట్ల పుస్తకాలను మళ్లీ వెనక్కి తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దేశపతి శ్రీనివాస్ స్పందించారు.
2014లో కొత్త పుస్తకాలు రూపొందించలేదు.. పాత పుస్తకాలనే కొనసాగించాం. ఒక్క సంవత్సరం పాటు అవే పుస్తకాలను విద్యార్థులు చదువుకున్నారు. ఆనాడు ఉమ్మడి ఏపీలో ఉన్న సిలబస్‌నే చదువుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎడిటర్లు, సీఎం, విద్యాశాఖ మంత్రి పేర్లు యధావిధిగా ఉన్నాయి. ముందుమాటలో కేసీఆర్ పేరు ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం ఓర్వలేకపోతోంది. దాదాపు 2 కోట్లకు పైగా పుస్తకాలు వాపస్ తెప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయని దేశపతి పేర్కొన్నారు.
ఇప్పుడు మళ్లీ ముందుమాట కోసం కొత్త పుస్తకాలను ముద్రించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప ఒరిగేదేమీ లేదు. అనవసరపు నిర్ణయాలతో ప్రజా ధనం దుర్వినియోగం చేయొద్దు. ఇప్పుడున్న పుస్తకాలు మార్చే అవకాశం లేదు. మార్చాలంటే కొత్త కమిటీ ఏర్పాటు చేయాలి. ఇప్పటికిప్పుడు కొత్త కమిటీ ఏర్పాటు చేయడానికి సమయం లేదు. వచ్చే ఏడాది పుస్తకాలు మార్చుకోవచ్చు.. అప్పుడు మీ పేర్లు పెట్టుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొంచపు బుద్ధి ఉంది. విగ్రహాలు మార్చుడు, గుర్తులు మార్చుడు అనే ధోరణిలో ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం సంకుచిత దృక్పథం వల్ల ప్రజా ధనం వృధా అవుతోంది. రేవంత్ రెడ్డి మాకు భేషజాలు లేవని అంటాడు మరి ఆయన చేసేది ఏంటి..? ప్రజాపాలన అంటూనే ప్రతి చిన్న విషయాల్లో కూడా సంకుచిత బుద్ధిని ప్రదర్శిస్తున్నారు అని దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు.