హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): అనేక ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న 27 శాతం బీసీ రిజర్వేషన్లను పలు యూనివర్సిటీలు బేఖాతరు చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం బీసీ విద్యార్థులను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. రోజులు మారినా బీసీల తలరాతలు మాత్రం మారడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నల్సార్ లా యూనివర్సిటీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయకుండా, వాటిని తుంగలో తొక్కి తమ ఇష్టారాజ్యంగా లా అడ్మిషన్లు జరుపుతున్నారని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, బీజేపీ ప్రభుత్వం ఉన్న బీసీ విద్యార్థులు మాత్రం నష్టపోతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
కంచె చేను మేసిన చందంగా పాలకుల ప్రవర్తన ఉన్నదని విమర్శించారు. జాతీయ స్థాయి లా కాలేజీలలో కూడా బీసీ రిజర్వేషన్లు అమలుచేయడం లేదని, దీనివల్ల అనేకమంది బీసీ విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడుస్తున్న నల్సార్ యూనివర్సిటీలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి సహా అనేకమంది ఉద్ధండులు దాని కార్యవర్గంలో ఉన్నప్పటికీ, బీసీ రిజర్వేషన్లు అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశామని తెలిపారు.
రూల్ ఆఫ్ రిజర్వేషన్లు న్యాయ విశ్వవిద్యాలయాల్లోనే అమలు కాకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. రా జ్యాంగాన్ని కాపాడాల్సిన ఆ వర్సిటీయే రిజర్వేషన్లకు తూట్లు పొడువడం దురదృష్టకరమన్నారు. ప్రధాని మోదీ బీసీ అయినప్పటికీ.. ఆ బీసీలకే అన్యాయం జరుగుతున్నదని దుయ్యబట్టారు. నల్సార్‌లో రిజర్వేషన్ విషయంలో జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్ నేతలు దూదిమెట్ల బాలరాజు యాద వ్, శుభప్రదపటేల్, చిరుమల్ల రాకేశ్‌కుమార్, జాతీయ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.