హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): అందాల పోటీల్లో మిస్ ఇంగ్లండ్‌తో అనుచితంగా ప్రవర్తించి, అవమానించిన ఘటనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ నుంచి సంబంధిత వివరాల కోసం సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు చేసినట్టు తెలిపారు. గురువారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దాసోజు మాట్లాడారు.
పోటీల్లో విదేశీ వనితల పట్ల అనుచితంగా ప్రవర్తించిన దొంగలను బయటకు తీసుకొచ్చే వరకు ఈ విషయాన్ని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. వద్దన్నా వినకుండా, పెట్టుబడులు వస్తాయని, మహిళా సాధికారత అని పెద్దపెద్ద మాటలు చెప్తూ మొండితనంతో అందాల పోటీలు నిర్వహించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మిస్ ఇంగ్లండ్‌తో అసభ్యంగా ప్రవర్తించి రాష్ట్రం పరువుతోపాటు దేశం పరువూ తీశారని దుయ్యబట్టారు. వేరే దేశంలో ఇలాంటి ఘటన జరిగితే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసేవారని, ఇక్కడి ప్రభుత్వం మాత్రం తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు.
రాష్ర్టానికి వచ్చిన అతిథితో రేవంత్‌రెడ్డి బంధువులు, ఆయన సన్నిహితులు ప్రవర్తించిన తీరు జుగుప్సాకరంగా ఉన్నదని దాసోజు ఆవేదన వ్యక్తంచేశారు. దీనికి రేవంత్ బాధ్యత వహించి దేశానికి, రాష్ర్టానికి క్షమాపణ చెప్పి లెంపలు వేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచ పోటీలు మళ్లీ నిర్వహిస్తే ఆ పోటీదారులు తిరిగి రమ్మన్నా రారని స్వయంగా మం త్రి పొన్నం ప్రభాకరే అన్నారని గుర్తుచేశారు.
మిస్ ఇంగ్లండ్‌ను అవమానించిన ఘటనను ఎన్హెచ్ఆర్సీ, ఎస్హెచ్ఆర్సీ సుమోటోగా తీసుకుని ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని దాసోజు ప్రశ్నించారు. తెలంగాణలో విదేశీ యువతులకు అవమానం జరిగితే కేంద్రమంత్రి బండి సంజయ్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఈ పోటీల్లో ప్రముఖులెవరూ పాల్గొనలేదని, మాజీ మిస్ వరల్డ్‌లు, మిస్ యూనివర్స్‌లు కూడా రాలేదని, జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా పోటీలకు కవరేజీ ఇవ్వలేదని విమర్శించారు.
తన ఇష్టం వచ్చినట్టు చేయడానికి తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ ప్రైవేటు ఎస్టేట్ కాదని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు మహిళలను అవమానిస్తుంటే సోనియా గాంధీ, ప్రియాంకగాంధీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. దీని వెనకున్నది సీఎం సన్నిహితులు కాబట్టి కేసును క్లోజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న గద్వాల్ జిల్లా ధన్వాడ రైతులను పోలీసులు బాదినట్టు బాదారని దాసోజు ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసుల దమనకాండను బీఆర్ఎస్ ఖండిస్తుందని అన్నారు. రేవంత్‌రెడ్డి ఇష్టం వచ్చినట్టు భూసేకరణ చేస్తుంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రైతులతో అతిగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ దాసోజు డిమాండ్ చేశారు.