హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని, గ్రూప్-1 పరీక్షలను రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై పోరాడి గ్రూప్-1 కేసు గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. తెలంగాణ గుత్తేదారులం తామే అనుకుంటూ రేవంత్‌రెడ్డి సర్కారు వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. రీకాల్ వ్యవస్థ లేకపోవడంతో ఐదేండ్లు తమ ఇష్టారాజ్యం అనుకుంటున్నారని విమర్శించారు. అభ్యర్థులకు అనుకూలంగా వచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా రిట్ అప్పీల్ చేయవద్దని డిమాండ్ చేశారు.
గ్రూప్-1కు సంబంధించిన మొత్తం వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ జరగాలని దాసోజు డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్షలకు సంబంధించి జీవో 29ని రద్దు చేసి, 55 జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలిస్తామని ఎన్నికల ముందు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అశోక్‌నగర్ వచ్చి ఇచ్చిన హామీకి సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. గ్రూప్-1 ఉద్యోగాల కోసం నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల జులుం వంటి పలు అంశాల వీడియోలను చూపించారు. ఉద్యోగాల కోసం విద్యార్థులు చేసే పోరాటాలను అడ్డుకోవడం కోసం, కశ్మీర్లో కవాతు చేసినట్టుగా అశోక్‌నగర్‌లో కూడా పోలీసులు కవాతు చేశారని, ఆడ, మగ తేడా లేకుండా విద్యార్థులపై ఇష్టారాజ్యంగా లాఠీచార్జి చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేవంత్‌కు, టీజీపీఎస్సీ చైర్మన్‌కు మానవత్వం ఉంటే గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం చేయాలని దాసోజు డిమాండ్ చేశారు. ఈ ఉద్యోగాలను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు అధికారంలో ఉండే నైతిక అర్హత లేదని మండిపడ్డారు. తెలుగు మీడియంలో గ్రూప్-1కు హాజరైన వారికి కూడా ఈ ప్రభుత్వం చేసిన అన్యాయంపై తూర్పారబట్టారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్‌క్లబ్‌కు వచ్చి హైకోర్టు జడ్జిమెంట్‌పై చర్చించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి విభాగం నేతలను పోలీసులు కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అణచివేయాలన్న ప్రయత్నం ఎక్కడా విజయవంతం కాలేదని గుర్తుచేశారు. గ్రూప్-1పై ప్రత్యేక అసెంబ్లీ పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ నేతలు.. తమ నోళ్లకు తాళాలు వేసుకున్నారా? అని ప్రశ్నించారు. బీజేపీని రేవంత్‌రెడ్డి కోసం నడుపుతున్నారా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిని కేంద్రమంత్రి బండి సంజయ్ కాపాడుతున్నాడని దుయ్యబట్టారు.
గ్రూప్-1 విషయంలో హైకోర్టు తీర్పును బేఖాతరు చేస్తే విద్యార్థులను తీవ్రవాదులుగా మార్చినట్టే అవుతుందని దాసోజు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందుకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాసినట్టు తెలిపారు. దీన్ని నేరుగా అందజేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు అనుకూలంగా హైకోర్టులో తీర్పు వస్తే తిరిగి దాన్ని కోర్టులో చాలెంజ్ చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించడం భావ్యం కాదని చెప్పారు.
గ్రూప్-1 అంశంపై విద్యార్థులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లు తెరవడం లేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు డివిజన్ బెంచ్‌కు వెళ్తుందని నిలదీశారు. జీవో 29 ఎవరి కోసం తెచ్చారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. దీనిపైనా అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని విద్యార్థి సంఘాలను ఏకం చేసి, సర్కారుకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని, మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీంద్రావు, బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు, కడారి స్వామి యాదవ్, కొడంగల్ బీఆర్ఎస్ నేత మహిపాల్ పాల్గొన్నారు.